కేసీఆర్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి  | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి 

Published Sun, Feb 6 2022 2:16 AM

Telangana: Revanth Reddy Seeks Case Against KCR - Sakshi

సాక్షి, గజ్వేల్‌/ హైదరాబాద్‌: రాజ్యాంగం మార్చాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో ఫిర్యాదు చేయించారు. ఈ ఫిర్యాదు కాపీని నర్సారెడ్డితో కలిసి సీఐ వీరప్రసాద్‌కు రేవంత్‌రెడ్డి అందజేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలు అంతర్జాతీయ తీవ్రవాదులకంటే ప్రమాదకరమని, ఈ వ్యా ఖ్యలు దళితులను కించ పరిచేవిధంగా ఉన్నా యని మండిపడ్డారు. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికి ఉదాత్తమైన రాజ్యాంగాన్ని అందించారని, ఇదే రాజ్యాంగం చలవతో తెలంగాణ ఆవిర్భవించడమే కాకుండా కేసీఆర్‌ కు సీఎం పదవి, వారి కుటుంబీకులకు పదవు లు, సంపద చేకూరిందన్నారు.

తాము ఇచ్చిన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు నమోదు వరకు పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్‌ దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పేవరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, నాయిని యాదగిరి పాల్గొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగానూ కాంగ్రెస్‌ ఫిర్యాదులు 
రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే 48 గంటల నిరసన దీక్ష చేసిన చేపట్టిన ఆ పార్టీ, కేసీఆర్‌పై ఠాణాల్లో ఫిర్యాదులు చేయాలని ప్రకటించింది. వరం గల్‌ హన్మకొండలో డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో డీసీసీ అధ్య క్షుడు డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఫిర్యాదు చేశారు.

ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగర అధ్యక్షుడు మహ్మద్‌ జావేద్, కామేపల్లిలో జెడ్పీటీసీ బానోతు వెంకట ప్రవీణ్‌కుమార్‌ నాయక్, కొత్తగూడెంలో టీపీసీసీ సభ్యుడు ఎడవెల్లి కృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల అధ్యక్షులు, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాలు నేతలు ఫిర్యాదులు చేశారు.  

Advertisement
Advertisement