సాగర తీరాన ధగధగల సౌధం | Sakshi
Sakshi News home page

సాగర తీరాన ధగధగల సౌధం

Published Fri, Apr 28 2023 3:35 AM

Telangana State New Secretariat Indo-Persian style of architecture - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ తీరాన ఓ భారీ భవన సముదాయం.. ఇండో–పర్షియన్‌ నిర్మాణ శైలి.. నిలువెల్లా సాంకేతికత.. గుమ్మటాలతో సంప్రదాయ రూపు..ఆధునిక హంగులతో కూడిన అద్భుత కట్టడం. చూడగానే తాజ్‌మహల్, మైసూర్‌ ప్యాలెస్‌ను తలపించే శ్వేతసౌధం..635 గదులు.. 30 సమావేశ మందిరాలు..34 గుమ్మటాలు.. అదే తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిని ప్రారంభించనున్నారు. 



మొత్తం 28 ఎకరాల్లో..
► సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. 

► సచివాలయ ప్రాంగణం 28 ఎకరాల్లో ఉంటుంది. ఇందులో భవనాల విసీర్ణం రెండున్నర ఎకరాలు. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్‌యార్డులో 2 ఎకరాల్లో లాన్‌ ఏర్పాటు చేశారు. వెరసి 90 శాతం స్థలం ఖాళీగా ఉంటే, పది శాతం మాత్రమే భవనాలున్నాయి. 

► ప్రాంగణంలో మొత్తం నిర్మిత స్థలం దాదాపు 10 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుంది. దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టా కూడా దాదాపు ఇంతే విస్తీర్ణంలో ఉంది.  



► ఈ భవనాన్ని 26 నెలల్లో పూర్తి చేశారు. మధ్యలో కోవిడ్‌ కారణంగా ఆరు నెల లు వృథా అయింది. అంటే 20 నెల ల్లోనే భవనాన్ని సిద్ధం చేసినట్టయింది. 

► నిర్మాణ పనుల్లో 3 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. చివరలో రాత్రింబవళ్లు 4 వేల మంది వరకు పనిచేశారు.



కుతుబ్‌మినార్‌ కన్నా ఎత్తు 
► సచివాలయ భవనం ఎత్తు 265 అడుగులు, ఇది కుతుబ్‌మినార్‌ (239 అడుగులు) కంటే ఎత్తు. భవనంపైన ప్రధాన రెండు గుమ్మటాల మీద ఏర్పాటు చేసిన అశోక చిహ్నాల్లో ఒక్కోదాని ఎత్తు 14 అడుగులు

► భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. అప్పట్లో 6 శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత 18 శాతానికి పెరిగింది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. ఇతరత్రా కారణాలతో నిర్మాణ వ్యయం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. 

► ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకునేందుకు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే. 

►గుమ్మటాల్లో రెండు పెద్దవి. ఒక్కోటి 50 అడుగుల డయాతో 48 అడుగుల ఎత్తున్నాయి. కొన్ని డోమ్‌లపై ఉన్న శూలాల్లాంటి శిఖర భాగం 9 అడుగుల ఎత్తు, ఐదు అడుగుల వెడల్పుతో ఉంది. 

360 డిగ్రీల కోణంలో నగర అందాలు
► పెద్ద గుమ్మటాల్లో ఉన్న స్థలాన్ని ప్రత్యేక ప్రాంతంగా రూపొందించారు. విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్‌ డిన్నర్‌లకు వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు.ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్‌గా పేర్కొంటున్నారు. 

► పార్లమెంటు భవనానికి వినియోగించిన ధోల్‌పూర్‌ ఎర్రరాయిని సచివాలయం కోసం 3.500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు. ఇందుకు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అక్కడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాద్‌కు తరలించారు. బేస్‌మెంట్‌ మొత్తానికి ఎర్ర రాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు రాయిని వాడారు. 

► స్తంభాలు ఇతర భాగాల్లో ప్రత్యేక నగిషీ ఆకృతుల కోసం గల్వనైజ్డ్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ (జీఆర్‌సీ) పద్ధతిలో ప్రీఫ్యాబ్రికేటెడ్‌ డెకొరేషన్‌ చేయించారు. తద్వారా దేశంలో ఈ స్థాయిలో జీఆర్‌సీ చేసిన తొలి భవనంగా సచివాలయం నిచిలింది. 

42 అడుగుల పోర్టికో..
► ప్రధాన పోర్టికో ఎత్తు ఏకంగా 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు. 

► భవనంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కై లాంజ్‌ వరకు వెళ్లేందుకు రెండు వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 లిఫ్టులున్నాయి. 

► సచివాలయానికి తూర్పువైపు ప్రధాన ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రజా ప్రతినిధులకు అనుమతి ఉంటుంది. పశ్చిమం వైపు అత్యవసర ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్యం వైపు ఉద్యోగుల ద్వారం, దక్షిణం వైపు సందర్శకుల ద్వారం ఏర్పాటు చేశారు. సందర్శకుల వాహనాలు ప్రధాన ప్రహరీ బయటే నిలపాల్సి ఉంటుంది. అధికారులు, సిబ్బందికి లోపల ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. 

► భవనానికి దక్షిణం వైపు సందర్శకుల రిసెప్షన్, ఎన్‌ఆర్‌ఐ రిసెప్షన్, పబ్లిసిటీ సెల్, రెండు బ్యాంకులు, రెండు ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసు, బస్, రైల్వే కౌంటర్లు, క్యాంటీన్, మీడియా కేంద్రాలను విడిగా నిర్మించారు. వెనుక వైపు సెక్యూరిటీ కార్యాలయం, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, ఉద్యోగుల పిల్లల క్రెచ్, ఆరోగ్య కేంద్రం, ఇండోర్‌ గేమ్స్‌ ప్రాంగణం, సహకార పొదుపు సంఘ కార్యాలయం, తదితరాలతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించారు. నైరుతి వైపు దేవాలయం, వెనక వైపు చర్చి, మసీదు నిర్మించారు. 



ప్రత్యేక పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
► తాగు నీటి కోసం 1.20 లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాంకు నిర్మించారు. ఇతర అవసరాలకు 1.80 లక్షల లీటర్ల సామర్థ్యంతో, అగ్నిమాపక అవసరం కోసం 2.80 లక్షల లీటర్ల సామర్థ్యంతో, వర్షపు నీరు స్టోరేజీ కోసం 2.40 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భంలో ట్యాంకులు నిర్మించారు.  

► వెనుకవైపు ఏడో అంతస్తులో ప్రత్యేకంగా సచివాలయ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధునిక సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు. నిత్యం తెలంగాణ స్పెషల్‌ పోలీసు విభాగానికి చెందిన 300 మంది రెండు షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కలెక్టరేట్లు, ప్రధాన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో సచివాలయం అనుసంధానమై ఉంటుంది. 

► సహజ సిద్ధమైన వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, పోర్టికోలు డిజైన్‌ చేశారు. నీళ్లు, కరెంటు పొదుపునకు వీలుగా నిర్మించినందున ‘ది ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌’ ఈ భవనానికి గోల్డ్‌ రేటింగ్‌ జారీ చేసింది. ఈ రేటింగ్‌ ఉన్న సచివాలయ భవనం దేశంలో ఇదొక్కటే. 

► త్వరలో సచివాలయ పార్కింగ్‌ కేంద్రాల రూఫ్‌టాప్‌పై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement