ఒమన్‌ పొమ్మంటోంది!

5 Jul, 2021 02:19 IST|Sakshi

విదేశీ వలస కార్మికులను వదిలించుకుంటున్న అరబ్‌ దేశం

గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న భారతీయ కార్మికులు  

మోర్తాడ్‌ (బాల్కొండ): విదేశీ వలస కార్మికులకు అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించిన ఒమన్‌ దేశం.. ఇప్పుడు వారిని వదిలించుకుంటోంది. స్వదే శీయులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బయటవారిని సాగనంపుతోంది. దీంతో వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టా డుతోంది. దీంతో అక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి, వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని ఒమన్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో ఒమనీయులకు పెద్దపీట వేశారు. అలాగే, చిన్న, మధ్య తరహా వాహనాల డ్రైవింగ్‌లోనూ తమ ప్రజలకు అవకాశం కల్పిస్తూ, విదేశీ డ్రైవర్ల లైసెన్స్‌ల రెన్యూవల్‌ను నిలిపి వేశారు. దీనికి తోడు ప్రైవేటు రంగంలోనూ ఒమన్‌ పౌరులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్‌ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు.  

తెలంగాణ కార్మికులకు పెద్ద దెబ్బ..
ఒమన్‌ నిర్ణయం తెలంగాణ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒమన్‌లో ఇప్పటివరకు ఉపాధి పొందిన విదేశీ వలస కార్మికులలో భారత్‌కు చెందిన వలసదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండగా, ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 1.25 లక్షల మంది ఉంటారని అంచనా. తాజా నిర్ణయంతో 80 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని అంచనా. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం .ఒమన్‌లో కొన్ని నెలల నుంచి భారతీయులే కాకుండా ఇతర దేశాల వ్యాపారులు, ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులకు కష్టకాలం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఒమన్‌లో బతకడం కష్టమే.


–నరేంద్ర పన్నీరు,

ఒమన్‌ తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు