కృష్ణా జలాలు.. ఫిఫ్టీ ఫిఫ్టీ | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలు.. ఫిఫ్టీ ఫిఫ్టీ

Published Thu, Feb 24 2022 2:20 AM

Telangana Writes To Krishna River Management Board For 50 Per Cent Share In Allocation Of Krishna Water - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా ట్రిబ్యునల్‌–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను తాత్కాలికంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో వాడుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణకు కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) రూపకల్పన చేసే నిబంధనల్లో ఇదే దామాషాను కొనసాగించడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇరు రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం జరిగేలా కేఆర్‌ఎంబీ నిబంధనలను సవరించాలని స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య జల పంపకాలు జరగాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ ఈ నెల 18న కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిర్వహణకు కేఆర్‌ఎంబీ రూపొందించిన పలు నిబంధనలను కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పుకు అనుగుణంగా సవరించాలని ఈ లేఖలో తెలంగాణ కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగునీటిని తీసుకోవడానికి 830 అడుగుల కనీస నీటి మట్టం ఉండాలని కృష్ణా ట్రిబ్యునల్‌–1 స్పష్టం చేసిందని, కేఆర్‌ఎంబీ నిబంధనల్లో సైతం 854 అడుగుల నుంచి 830 అడుగులకు మార్చాలని సూచించింది. 
లేఖలో పేర్కొన్న అంశాలివీ..

  • పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీలను.. నాగార్జునసాగర్‌ ఎగువన కృష్ణా నదిలోకి తరలిస్తామని, అందులో 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలకు, మిగిలిన 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌ ఎగువ ప్రాంత అవసరాలకు వాడుకుంటామని అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్‌ ముందు అంగీకారం తెలిపింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలకు ఈ 45 టీఎంసీలు అదనం.  గోదా వరి జలాల మళ్లింపు ఆధారంగా ఉమ్మడి ఏపీ గతంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును చేపట్టింది. అందువల్ల ఈ 45 టీంఎసీలను క్యారీ ఓవర్‌గా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసేందుకు అనుమతించరాదు. దీంతో తెలంగాణ 45 టీఎంసీలను కోల్పోతుంది. 
  • కృష్ణా నదిలోని ఫ్రీ సప్లైయిస్‌ నుంచి 72.2 టీఎంసీల కృష్ణా డెల్టా ఆయకట్టు డిమాండ్‌ను తీర్చా లని కృష్ణా ట్రిబ్యునల్‌–1 పేర్కొనగా, నాగార్జునసాగర్‌ నుంచి కేటాయించడం సరికాదు. ఈ కేటాయింపులను సవరించాలి. కృష్ణా డెల్టాకు 152.2 టీఎంసీల అవసరాలు ఉండగా, 181.2 టీఎంసీల లభ్యత ఉంది. నాగార్జునసాగర్‌ దిగువన ఉన్న క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి 101.2 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపు ద్వారా 80 టీఎంసీల లభ్యత ఉంది. కృష్ణా డెల్టాలో అదనంగా ఉన్న 29 టీఎంసీల లభ్యతను నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు కేటాయించాలి.  
  • కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పులోని క్లాజ్‌–7 ఆధారంగా నాగార్జునసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు 5.7 టీఎంసీల తాగునీటి కేటాయింపులు చేయాలి.
  • శ్రీశైలం జలాశయంలో 582.5 టీఎంసీల జలాల లభ్యత ఉందని కేఆర్‌ఎంబీ రూల్స్‌లో పేర్కొంది. నాగార్జునసాగర్, హైదరాబాద్‌ తాగునీరు, చెన్నైకి సరఫరా, ఎస్‌ఆర్‌బీసీలకు కలిపి మొత్తం 300 టీఎంసీలు పోగా, మిగి లే 282.5 టీఎంసీల నుంచి తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీకు 40 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోత లకు 40 టీఎంసీలు, నెట్టేంపాడు ఎత్తిపోతలకు 25.4 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికు 90 టీఎం సీలు, డిండికి 30 టీఎంసీలు కేటాయించాలి. 

Advertisement
Advertisement