ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో నో ప్రాబ్లమ్‌ | Sakshi
Sakshi News home page

ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో నో ప్రాబ్లమ్‌

Published Wed, Aug 26 2020 2:18 AM

There Is No Evidence Corona Virus Can Enter Human Body Through Food - Sakshi

క్షి, హైదరాబాద్‌: ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉం దనే దానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. అయితే, ఆహార పదార్థాల వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో వైరస్‌ వ్యాప్తి జరగదని వెల్లడించింది. ఏ ఆహార పదార్థమైనా పరిమిత స్థాయిలో తీసుకోవాలని, వినియోగానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫలానా పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. 

డబ్ల్యూహెచ్‌వో చెబుతున్న జాగ్రత్తలివీ..
ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయల ద్వారా కోవిడ్‌–19 వ్యాప్తి చెందుతుందన్న దానికి ఆధారాల్లేవు. తగిన జాగ్రత్తలతో తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. 
పండ్లు, కూరగాయలను వాడే ముందు శుభ్రపరచాలి. ముందుగా చేతుల్నిసబ్బుతో కడుక్కున్నాక ముట్టుకోవాలి. ఆపై వాటిని స్వచ్ఛమైన నీటితో కడగాలి. పచ్చివి తినాల్సి వస్తే మరింత శుభ్రంగా కడగాలి. 
 జీవం ఉన్న జంతువులు, మనుషుల్లోనే వైరస్‌ బతికి ఉండడంతో పాటు, వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉంది. ప్యాకేజీ ఉపరితలాల ద్వారా వైరస్‌ వ్యాపించదు. కాబట్టి ప్యాకేజీ ఫుడ్‌ హానికరం కాదు. ఈ ఫుడ్‌ ప్యాకెట్లను శానిటైజ్‌ చేయాల్సిన పనిలేదు. కానీ వాటిని ముట్టుకునే ముందు, తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. 
ఆహార పదార్థాల్లో ఉండే ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియాల మాదిరిగానే నిర్ణీత ఉష్ణోగ్రత వరకు ఉడికిస్తే కరోనా వైరస్‌ కూడా చనిపోతుంది. మాంసం, గుడ్లను కనీసం 70 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఉడికించాలి. అయితే, మాంసం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. 
గృహావసరాల కోసం మార్కెట్లు, మాల్స్‌కు వెళ్లినంత మాత్రాన కరోనా సోకదు. కానీ మాల్స్, మార్కెట్లలోకి ప్రవేశించే ముందు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి. దగ్గు లేదా తుమ్ము వస్తే మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. కనీసం మీటర్‌ భౌతికదూరం పాటించాలి. మాస్క్‌ రక్షణ తప్పనిసరి. సరుకులు తీసుకుని ఇంటికి వెళ్లాక చేతులు కడుక్కోవాలి. 
నిత్యావసరాల హోం డెలివరీ కారణంగా వైరస్‌ వ్యాపించదు. కానీ ఆ సరుకులు తెచ్చే వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి. సరుకులు తీసుకున్న తర్వాత చేతులు చాలా జాగ్రత్తగా, శుభ్రంగా కడుక్కోవాలి. 
వైరస్‌ బారినపడకుండా బలమైన ఆహారం తీసుకోవడం అవసరమే. మంచి ఆహారపుటలవాట్లు కలిగి ఉండాలి. ధాన్యాలు, పండ్లు, మాంసం, కూరగాయలు, గింజలు, పీచు పదార్థాలు ఎక్కువ తినాలి. పసుపు, అల్లం ఎక్కువగా తీసుకుంటే కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదు. 
హెర్బల్‌ టీ ఆరోగ్యపరంగా మంచిదే. కానీ కరోనా వైరస్‌ను నివారించదు. ఏ ఆహార పదార్థమైనా పరిమిత స్థాయిలో తీసుకోవడమే మేలు.  

Advertisement
Advertisement