డీఎస్సీ హడావుడి షురూ | Sakshi
Sakshi News home page

డీఎస్సీ హడావుడి షురూ

Published Thu, Mar 21 2024 2:10 AM

This time DSC applications are likely to cross 3 lakhs - Sakshi

ప్రశ్నపత్రం కఠినంగా ఉండొచ్చనే వాదన

ప్రిపరేషన్‌ లేకుంటే కష్టమనే ప్రచారం

మార్కెట్‌ ట్రెండ్‌ పెంచిన కోచింగ్‌ కేంద్రాలు

ఈసారి డీఎస్సీ దరఖాస్తులు 3 లక్షలు దాటే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ హడావుడి మొదలైంది. మంచి కోచింగ్‌ కేంద్రాల కోసం టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసినవారు వెతుకుతున్నారు. అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్‌ కేంద్రాలు లోతైన మెటీరియల్‌ ఇస్తామని, సబ్జెక్ట్‌ నిపుణులతో ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే జూలై 17 నుంచి 31 వరకూ ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. గత ఏడాది డీఎస్సీకి 1.70 లక్షల దరఖాస్తులు వస్తే, ఇవి కాకుండా కొత్తగా ఇప్పటి వరకూ మరో 25 వేల మంది వరకూ దరఖాస్తు చేశారు.

డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో గడువు ముగిసే నాటికి మరో లక్ష మంది వరకూ డీఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశముంది. మొత్తంగా 3 లక్షల మంది ఈ ఏడాది డీఎస్సీకి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోచింగ్‌ తీసుకునేందుకు 1.50 లక్షల మందికిపైగా హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  

తేలికగా ఉండదని...
ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈసారి కఠినంగా ఉంటుందని కొన్ని కోచింగ్‌ కేంద్రాలు చెబుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ఈ తరహా ప్రచారానికి తెరలేపాయి. 2017 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్‌ లేకపోవడం, టెట్‌ ఉత్తీర్ణత సాధించినవారి సంఖ్య ఏటా పెరుగుతుండటంతో దరఖాస్తుదారుల సంఖ్య భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు. పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టిందని వారు అంటున్నారు. గతంలో మాదిరి తేలికైన, సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారు.

మ్యాథ్స్, సైన్స్‌ సహా సైకాలజీ సబ్జెక్టుల్లోనూ కఠినమైన రీతిలో ప్రశ్నలు రూపొందించొచ్చని చెబుతున్నారు. నూతన విద్యావిధానం అమలులోకి వస్తున్న తరుణంలో బోధన పద్ధతుల నుంచి లోతైన ప్రశ్నలు ఉంటాయంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ బోధన మెళకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డీఎస్సీలో ఉంటుందని నిపుణులూ అంటున్నారు. గత కొంతకాలంగా బీఈడీ, డీఎడ్‌లో ఇవన్నీ లేవని, కాబట్టి కొత్త విషయాలను అవగాహన చేసుకుంటే తప్ప డీఎస్సీ  తేలికగా రాయడం కష్టమనే వాదనను కోచింగ్‌ కేంద్రాలు ప్రచారం చేస్తున్నాయి.

అయితే, నిర్దేశించిన సిలబస్‌ నుంచే ప్రశ్నపత్రం ఉంటుందని, కాకపోతే నవీన బోధన విధానాలు, సైకాలజీ నుంచి సరికొత్త విషయాలతో ప్రశ్నపత్రం రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. దీనినిబట్టి అకడమిక్‌ పుస్తకాలకు అందని రీతిలో డీఎస్సీ ఉంటుందా? అనే సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పోటీ పెంచుతున్న కోచింగ్‌ సెంటర్లు 
కొత్త స్టడీ మెటీరియల్‌ రూపకల్పన, ఫ్యాకల్టీ ఎంపికపై కోచింగ్‌ కేంద్రాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మూడు నెలల కాల పరిమితితో కూడిన డీఎస్సీ కోచింగ్‌ సిలబస్‌ రూపొందిస్తున్నాయి. సొంతంగా మెటీరియల్‌ తయారు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే  20 ప్రముఖ కోచింగ్‌ సెంటర్లు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో ఉన్నాయి. మరో వంద వరకూ చిన్నాచితక సెంటర్లు వెలిశాయి.

స్వల్పకాలిక కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ డిమాండ్‌ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా కోచింగ్‌ ఉంటుందని చెబుతున్నాయి. డీఎస్సీ రాసేవారిలో నాలుగేళ్ల ముందు  బీఎడ్, డీఎడ్‌ ఉత్తీర్ణులైన వారున్నారు. ఒక్కసారిగా సిలబస్‌ మారుతోందనే ప్రచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

కొత్త తరహా ప్రశ్నపత్రం వస్తే కష్టమనే భావన బలపడుతోంది. అయితే, మెథడాలజీ, సబ్జెక్టులపై అవగాహన ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఏదేమైనా కోచింగ్‌ కోసం ఈ తరహా అభ్యర్థులు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు.  

Advertisement
Advertisement