భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లపై సమీక్ష | Sakshi
Sakshi News home page

భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లపై సమీక్ష

Published Fri, Oct 7 2022 3:19 AM

TPCC Chief Revanth Reddy Examined Route Map Of Bharat Jodo Yatra - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌/మరికల్‌/కృష్ణా/కోస్గి/మక్తల్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఈ నెల 24న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. గురువారం జడ్చర్ల నుంచి ఆయన తన వాహనం నుంచే మహబూబ్‌నగర్‌ పట్టణంలోని గోపాల్‌రెడ్డి గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్, జేపీఎన్‌సీఈ కళాశాల, మన్యంకొండ స్టేజీలను పరిశీలించి దేవరకద్ర మీదుగా వెళ్లారు.

కోస్గి, మక్తల్‌లోనూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా పార్టీ నాయకులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌ కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లారు. అక్కడ మాజీ ఎంపీ బోస్‌రాజ్, బివినాయక్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్రలో తీసుకోవాల్సిన చర్యలు, జన సమీకరణ తదితర అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. రేవంత్‌ వెంట మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు. 

రేవంత్‌ నివాసానికి దిగ్విజయ్, జైరాం, మాణిక్యం 
దసరా పండుగ సందర్భంగా ఏఐసీసీ నేతలకు రేవంత్‌రెడ్డి అల్పాహార విందు ఇచ్చారు. భారత్‌ జోడో యాత్రపై సమీక్ష కోసం ఏఐసీసీ ముఖ్యనేతలు దిగ్వి జయ్‌సింగ్, జైరాం రమేశ్, కొప్పుల రాజు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ అంతకుముందు రోజు హైదరాబాద్‌లో ఉన్నారు. దసరా పండుగ కావడంతో వీరందరిని తన నివాసానికి ఆహ్వానించిన రేవంత్‌ వారికి ఘనంగా అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

ఈ విందులో టీపీసీసీ నేతలు సంపత్‌ కుమార్, రేణుకా చౌదరి, హర్కర వేణుగోపాల్‌తోపాటు మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై నేతలు చర్చించుకున్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఏర్పాటు చేసిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గురించి కూడా కాంగ్రెస్‌ నేతల మధ్య చర్చ జరిగిందని, ఈ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దిగ్విజయ్‌ సింగ్, జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

Advertisement
Advertisement