జీపీఎస్‌ అటెండెన్స్‌ వద్దు 

21 Sep, 2021 02:36 IST|Sakshi

ఏ ప్రభుత్వ ఉద్యోగికీ లేనపుడు మాకే ఎందుకు? 

పంచాయతీ కార్యదర్శుల ఆవేదన 

యాప్‌లో అటెండెన్స్‌ లొకేషన్‌ను తొలగించాలని వినతి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సర్వీసు నిబంధనలు తమకెందుకని గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్‌ యాప్‌తో అటెండెన్స్‌ నమోదు, రోజంతా కార్యకలాపాలు, విధుల నిర్వహణపై జీపీఎస్‌ ద్వారా ట్రాకింగ్‌ ఎందుకని వాపోతున్నారు. సోమవారం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన జీపీఎస్‌ అటెండెన్స్‌ను పాటించలేమంటూ పర్మినెంట్‌ గ్రామ కార్యదర్శులతోపాటు జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలు సైతం జిల్లా కలెక్టర్లు మొదలు పీఆర్‌ కమిషనర్, కార్యదర్శి, సీఎస్‌దాకా వినతిపత్రాలను ఇస్తున్నారు. 

ఉదయం 8:30 గంటలకే... 
ఉదయం 8.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామకార్యదర్శులు సెల్ఫీ దిగి కొత్త డీఎస్‌ఆర్‌ మొబైల్‌ పీఎస్‌ యాప్‌ ‘క్యాప్చర్‌ జీపీ లొకేషన్‌’ఆప్షన్‌ ద్వారా అటెండెన్స్‌ నమోదు చేయాలి. రోజుకు 12 గంటలకు పైబడి విధులు, కింది నుంచి పైస్థాయి వరకు పదిమంది దాకా బాస్‌లు, రోజూ వారడిగే నివేదికలు ఇలా అనేక బరువు బాధ్యతలతో పనిచేస్తున్న తమపై ఇప్పుడు జీపీఎస్‌ అటెండెన్స్‌ విధానాన్ని తీసుకురావడం సరికాదని అంటున్నారు.

దీంతోపాటు రోజూ డీఎస్‌ఆర్‌ యాప్‌లో రోడ్లు, డ్రైన్లు తదితరాలతోపాటు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటి చెత్త సేకరణ వంటి ఐదు ఫొటోలు లైవ్‌లో అప్‌లోడ్‌ చేయాలి. జీపీఎస్‌ ద్వారా అటెండెన్స్‌ నమోదు చేశాకే డీఎస్‌ఆర్‌ యాప్‌లో మిగతా ఆప్షన్లు ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. 

మాకెందుకు నాలుగేళ్ల ప్రొబేషన్‌  
రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు మూడువేల మంది పర్మినెంట్‌ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. రెండున్నరేళ్ల కింద ఏడున్నరవేల జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలను (జేపీఎస్‌) నియమించారు. మరో రెండువేల మంది దాకా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ జూనియర్‌ సెక్రటరీలు కూడా పనిచేస్తున్నారు. తొలుత జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచారు. మహిళా జేపీఎస్‌లకు ప్రసూతి సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఇతర ప్రభుత్వోద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్‌ ఉంటే తమకు నాలుగేళ్లు ఎందుకని అంటున్నారు. 

నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి 
జీపీఎస్‌ ద్వారా ఫిజికల్‌ టచ్‌ లైవ్‌ లొకేషన్‌ అటెండెన్స్‌ నమోదు రద్దుచేయాలి. సెక్రటరీలకు నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి. ఉపాధి హామీ పనులకు ఒక క్షేత్రస్థాయి సహాయకుడిని ఇవ్వాలి. పంచాయతీల్లో సాంకేతిక పనుల నిర్వహణకు ట్యాబ్‌లెట్, సిమ్‌కార్డు, ఇంటర్నెట్, డేటా కార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజించాలి. ప్రస్తుత సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం 4 గ్రేడ్లు కొనసాగించాలి. 
–పి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సంఘం 

పని ఒత్తిడి ఎక్కువ 
యాప్‌ ద్వారా జీపీఎస్‌ పద్ధతిలో అటెండెన్స్‌ నమోదు చేయొద్దని కలెక్టర్లను కోరాం. మేము లేవనెత్తిన అంశాలపై కలెక్టర్లు, పీఆర్‌ ఉన్నతాధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మా కార్యాచరణను ఖరారు చేస్తాం. సోమవారం నుంచి అటెండెన్స్‌ మాత్రం నమోదు చేయడం లేదు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. 
–నిమ్మల వెంకట్‌ గౌడ్, అధ్యక్షుడు, జూనియర్‌ సెక్రటరీల సంఘం  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు