ప్యాసింజర్‌ చార్జీల మోత | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ చార్జీల మోత

Published Mon, Jul 19 2021 12:43 AM

Train ticket prices increase by 40 percent - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్యాసింజర్‌ రైలు ప్రయాణం ఇక నుంచి సామాన్యులకు భారంగా మారనుంది. సోమవారం నుంచి పట్టాలెక్కనున్న ప్యాసింజర్‌ రైళ్ల వేగంతోపాటే చార్జీల పెంపునకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. కోవిడ్‌ కారణంగా గతేడాది మార్చి 22 నుంచి నిలిపివేసిన ప్యాసింజర్‌ రైళ్లను 16 నెలల తర్వాత పునరుద్ధరించారు. సోమవారం నుంచి 82 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు కేవలం రూ.50 లోపు చార్జీలతో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇక నుంచి ఈ రైళ్లలో ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ఉన్న ప్యాసింజర్‌ చార్జీలపైన 30 నుంచి 40% వరకు భారం పడనుంది. ఈ రైళ్లన్నిం టినీ అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చడంతో ఆటోమేటిక్‌గా చార్జీలు సైతం పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌కు ముందు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నడిచిన ఈ రైళ్లు సోమవారం నుంచి గంట కు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రైళ్లవేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది.  

అన్ని చోట్ల అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు  
ఇప్పటివరకు రిజర్వేషన్‌ టికెట్ల తరహాలోనే జనరల్‌ సీట్లకు సైతం ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవలసి వచ్చింది. ఇక నుంచి అన్ని రైల్వేస్టేషన్లలో కౌం టర్ల ద్వారా ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చు. ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్‌(ఏటీవీఎం) యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు.  

Advertisement
Advertisement