Sakshi News home page

ఢిల్లీతో ఢీకి టీఆర్‌ఎస్‌ రెడీ​

Published Mon, Dec 7 2020 2:50 AM

TRS Support Bharat Bandh On 8th December - Sakshi

  • ఈ నెల 8న రైతులు తలపెట్టిన ‘భారత్‌ బంద్‌’కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు.
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో బంద్‌కు మద్దతుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. 
  • రాజకీయంగా టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేలా బీజేపీ ఇటీవల రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరిని తిప్పికొట్టేలా వ్యూహరచన చేయడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. 

సాక్షి, హైదరాబాద్‌: తాజా రాజకీయ పరిస్థితుల్లో బీజేపీపై దూకుడుగా వెళ్లాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయిం చింది. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, కేంద్ర ప్రభుత్వ ఇతర ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనుంది. భావసారూప్య పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకూ సిద్ధమవు తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలోని తాజా సమీకరణాలతో భిన్న వైఖరి తీసుకోనుంది. ఓ వైపు క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ యంత్రాంగాన్ని క్రియాశీలం చేస్తూనే... మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. 
విపక్షనేతలతో టచ్‌లో కేసీఆర్‌
కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసిందని, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. డిసెంబర్‌ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో హైదరాబాద్‌లో భారీ సదస్సును నిర్వహిస్తామని గత నెలలో కేసీఆర్‌ ప్రకటించారు. రైతు సమస్యలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల ఫలితాన్ని చూసిన తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్, అఖిలేశ్‌ యాదవ్, స్టాలిన్‌ వంటి నేతలతో కేసీఆర్‌ ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన బీహార్‌ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ కూడా తనతో టచ్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో మరింత బలంగా
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తూ... రాజకీయ పార్టీలు, విమర్శల జోలికి పెద్దగా వెళ్లకపోవడం కూడా తమకు నష్టం చేసిందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఇటీవలి కాలంలో విమర్శలు పెంచినా తిప్పికొట్టడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందనే భావన నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ యంత్రాంగంలో కదలిక తేవడంతో పాటు, ప్రజల్లోకి దూకుడుగా వెళ్లాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, శిక్షణ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల క్షేత్రస్థాయి పర్యటనలు వీలైనన్ని ఎక్కువగా ఉండేలా చూడనుంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం నిరంతరం ప్రజల్లో ఉండేలా చూడాలని నిర్ణయించింది. 

భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు: కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని భారత్‌ బంద్‌ను కేసీఆర్‌ సమర్థించారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందని కేసీఆర్‌ గుర్తుచేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ బంద్‌ విజయవంతానికి టీఆర్‌ఎస్‌ పార్టీ కృషి చేస్తుందని, బంద్‌కు సంఘీభావం తెలిపి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement