టీఆర్‌ఎస్‌లో రోజుకో జిల్లాలో అసమ్మతి రాజకీయం.. ఇప్పుడు వికారాబాద్‌ పంచాయితీ!

12 Aug, 2022 02:16 IST|Sakshi

16న సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా నేతలతో భేటీ 

బహిరంగ సభకు ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో రోజుకో జిల్లాకు సంబంధించిన అసమ్మతి రాజకీయం ప్రగతిభవన్‌కు చేరుకుంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ ఆ నియోజకవర్గ నేతలు బుధవారం ప్రగతిభవన్‌ మెట్లెక్కారు. తాజాగా వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు తమ మధ్య విభేదాలు ఉన్నాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న వికారాబాద్‌ జిల్లా కొత్త కలెక్టరేట్, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవనాలను ప్రారంభించి.. కొత్తగా మంజూరైన మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు.

తర్వా త బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కాలె యాదయ్య (చేవెళ్ల), మహేశ్వర్‌రెడ్డి (పరిగి), రోహిత్‌రెడ్డి (తాండూరు), పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్‌) భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీత ఈ సమావేశంలో పాల్గొనలేదు. సీఎంతో భేటీకి సంబంధించి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సునీతకు సమాచారం లేనందునే హాజరుకాలేదని సమాచారం. 

సబితకు సభ బాధ్యతలు 
వికారాబాద్‌ సభకు జన సమీకరణ, పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యే కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు తదితరాల అంశాలపై కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్ల సమన్వయ బాధ్యతలను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. తర్వాత సీఎంతో వికారాబాద్‌ జిల్లా టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేశారు. 

కేటీఆర్‌తో మహేందర్‌రెడ్డి భేటీ 
కేసీఆర్‌తోభేటీకి హాజరుకాని పట్నం మహేం దర్‌రెడ్డి.. గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం భేటీకి వెళ్లకపోవడానికి కారణాలను చెప్పినట్టు తెలిసింది. వికారాబాద్, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రాజీనామా చుట్టూ రాజకీయం జరుగుతోందని, కొత్త చైర్మన్ల ఎన్నిక కోసం ఆ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోద్బలంతో తెరవెనుక మంత్రాంగం సాగుతోందని మహేందర్‌రెడ్డి వివరించినట్టు సమాచారం. మరికొన్ని మున్సి పాలిటీల్లోనూ ఈ పరిస్థితి ఉందని.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రాజీనామా తలనొప్పులు తెచ్చిపెడుతుందని కేటీఆర్‌ చెప్పినట్లు తెలిసింది.
చదవండి: కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదాం!

మరిన్ని వార్తలు