ఎంసెట్‌ అగ్రి, మెడికల్‌ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ అగ్రి, మెడికల్‌ ఫలితాలు విడుదల

Published Sun, Oct 25 2020 2:55 AM

TS EAMCET 2020 Agriculture And Medical Results Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌ ఫలితాలు వెలువడ్డాయి. శనివారం జేఎన్‌టీయూహెచ్‌లోని యూజీసీ–హెచ్‌ఆర్‌డీసీ ఆడిటోరియంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చరల్‌–మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించారు. తొలుత ఇంజనీరింగ్‌ ఫలితాలు ప్రకటించారు. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షలకు సంబంధించి ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఎంసెట్‌ అగ్రికల్చరల్‌–మెడికల్‌ స్ట్రీమ్‌ కేటగిరీలో 78,981 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 63,857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 59,113 మంది అర్హత సాధించారు. హాజరైన విద్యార్థుల్లో 92.57 శాతం మంది క్వాలిఫై అయ్యారు.
తొలి 3 ర్యాంకులు బాలికలవే..
టీఎస్‌ ఎంసెట్‌–20 అగ్రికల్చరల్‌–మెడికల్‌ స్ట్రీమ్‌లో టాప్‌10 ర్యాంకుల్లో తొలి 3 ర్యాంకులను బాలికలే కైవసం చేసుకున్నారు. మిగతా 7 స్థానాల్లో బాలురు ఉన్నారు. టాపర్‌గా ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు నిలిచారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే... ఈ పరీక్షల్లో బాలురు 20,127 మంది పరీక్షకు హాజరు కాగా 18,377 మంది (91.30%) అర్హత సాధించారు. 43,730 మంది బాలికలు పరీక్ష రాయగా 40,736 మంది (93.15%) అర్హత సాధించారు. ఎంసెట్‌ అగ్రి, మెడికల్‌ స్ట్రీమ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు.
 

Advertisement
Advertisement