వైద్యులకు ఇష్టమైనచోట పోస్టింగ్‌ | Sakshi
Sakshi News home page

వైద్యులకు ఇష్టమైనచోట పోస్టింగ్‌

Published Mon, Nov 28 2022 1:36 AM

TS Medical And Health Department Decided To Give MBBS Doctors Posting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ అర్హతతో నియమితులయ్యే డాక్టర్లకు ఇష్టమైనచోట పోస్టింగ్‌ ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వారిచ్చే ప్రాధాన్యాల ప్రకారం సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రజారోగ్య సంచాలకుడి(డీహెచ్‌) పరిధిలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌(టీవీవీపీ) పరిధిలో 211 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి రాష్ట్ర మెడికల్, హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది.

ఒకట్రెండు రోజుల్లో తుదిజాబితాను ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్, వైద్య విద్యా సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డికి అందజేస్తారు. వారు విడివిడిగా ఆయా పోస్టులకు ప్రాధాన్యాల ప్రకారంకౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. త్వరలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. వీలున్నంత వరకు ఇష్టమైనచోటనే పోస్టింగ్‌ వచ్చేలా ప్రయత్నిస్తామని అధికారులు వెల్లడించారు. ఒకేచోటికి ఎక్కువమంది పోటీపడితే అప్పుడు వారి మార్కులు, వెయిటేజీ, భార్యాభర్తల అంశం, అనారోగ్యం వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు. అందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేయనున్నారు. 

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని...
గతంలో ఒకట్రెండు సందర్భాల్లో డీహెచ్, టీవీవీపీ, డీఎంఈ పరిధిలో ప్రాధాన్యాల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో అప్పుడు అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. నాలుగేళ్ల క్రితం టీవీవీపీ పరిధిలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీ సందర్భంగా భార్యాభర్తలు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగ్‌లు ఇచ్చారు. భార్యాభర్తలను విడదీసి ఎక్కడెక్కడో వేశారన్న ఆరోపణలున్నాయి.

దీంతో వందలాది మంది పోస్టుల్లో చేరనేలేదు. కొందరు చేరాక విధుల్లోకి రాకపోవడంతో అనేకమందిని తొలగించారు. డీహెచ్‌ పరిధిలోని డాక్టర్లకు గతంలో హడావుడిగా పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో అనేకమంది తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వారికోసం ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఇప్పుడు బదిలీల ప్రక్రియ చేపట్టారు.

అందుకోసం మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, సర్వీస్‌ రూల్స్, అనుభవం, ఔట్‌సోర్సింగ్‌ లేదా కాంట్రాక్టు వెయిటేజీ అనుసరించి బోర్డు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎక్కువమంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నవారే ఎంపికయ్యారు.   

Advertisement
Advertisement