TSPSC Paper Leak: SIT Official Arrest Rajasekhar Relative Prashanth - Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసు: గ్రూప్‌-1లో 100కు పైగా మార్కులు.. రాజశేఖర్‌ బావ ప్రశాంత్‌ అరెస్ట్‌

Published Sat, Mar 25 2023 9:06 AM

TSPSC paper Leak: SIT Official Arrest Rajasekhar Relative Prashanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌: న్యూజిలాండ్‌లో నివసిస్తూ గతేడాది గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌ వచ్చి వెళ్లిన కమిషన్‌ నెట్‌వర్క్‌ ఆడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి సమీప బంధువు(బావ) ప్రశాంత్‌ను సిట్‌ దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది. రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు సిట్‌ అధికారులు.

ప్రశాంత్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ ఉపాది పథకంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నవాబ్ పేట వెళ్లిన సిట్ అధికారులు ఎంపీడీవో కార్యాలయం చేరుకుని.. అక్కడే ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించిన అనంతరం అతన్ని హైదరాబాద్ తరలించారు.

అయితే టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన ప్రశాంత్‌కు..100కుపైగా మార్కులు వచ్చినట్లు సిట్‌ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రశాంత్.. మరో ముగ్గురితో కలిసి 15 లక్షలు వెచ్చించి గ్రూప్-1 పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో అరెస్ట్‌ అయిన నిందితుల సంఖ్య 13కుచేరింది. నిందితుల్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ కేసులో సిట్‌ అధికారులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌  పిటిషన్‌పై నేడు(శనివారం)నాంపల్లి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఏ-1 ప్రవీణ్, ఏ-2 రాజశేఖర్ రెడ్డి, ఏ-4 డాక్య, ఏ-5 కేతావత్ రాజేశ్వర్, ఏ-10 షమీమ్, ఏ-11, సురేష్, ఏ-12 రమేష్‌లను సిట్‌ ఆరు రోజుల కస్టడీ కోరింది.
చదవండి: ‘టీఎస్‌పీఎస్సీ కేసు’లో సాక్షిగా శంకరలక్ష్మి

Advertisement
Advertisement