పరిచయాలే పావుగా వాడుకున్నారు..! | Sakshi
Sakshi News home page

పరిచయాలే పావుగా వాడుకున్నారు..!

Published Sat, Dec 4 2021 4:10 AM

Two Accused Arrested In Telugu Akademi Fraud Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్ల స్కాంలో మరో ఇద్దరు నిందితులను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన యోహాన్‌ రాజు, స్కామ్‌ సొమ్ము డిపాజిట్‌ చేయించుకున్న ఆయన భార్య ప్రమీలరాణిని విజయవాడ నుంచి పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 13కు చేరింది. మరోవైపు సూత్రధారి సాయితోసహా ఆరుగురు నిందితులను సీసీఎస్‌ పోలీసులు తదు పరి విచా రణ కోసం శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు.

కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా..: విజయవాడలోని చిట్టినగర్‌లో ఉన్న ప్రైజర్‌పేట పెద్దిరాజులవారి వీధికి చెందిన పూసలపాటి యోహాన్‌ రాజుకు మం దుల దుకాణం ఉంది. స్నేహితులు, పరిచయస్తుల్లో అనేక మందికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుం టాడు. ఇలా ఇతడికి అనేక బ్యాంకులకు చెందిన మేనేజర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో విజయవాడలోని ఆంధ్రా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసిన మస్తాన్‌ వలీతోనూ రాజుకు పరిచయ మైంది.

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌ విలీనంతో నగరానికి బదిలీపై వచ్చిన మస్తాన్‌ వలీ సంతోష్‌నగర్‌ బ్రాంచ్‌కు మేనేజర్‌గా పని చేస్తూ  కార్వాన్‌ బ్రాంచ్‌ బాధ్యతలూ నిర్వర్తించాడు. ఈ స్కాం సూత్రధారి సాయికుమార్‌కు వెంకట రమణ ప్రధాన అనుచరుడిగా పని చేశాడు. కొన్నాళ్ల క్రితం రమణ తన స్నేహితుడి శుభకార్యం కోసం విశాఖ వెళ్లాడు. అక్కడే పరిచయస్తుల ద్వారా యోహాన్‌ రాజు ఇతడికి పరిచయమయ్యాడు. విజయవాడలో ఉండే రాజు బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంటాడని, చాలా మంది బ్యాంకు మేనేజర్లు తెలుసని కామన్‌ ఫ్రెండ్‌ చెప్పాడు.  

మేనేజర్ల అవసరం రావడంతో..
తెలుగు అకాడమీ ఎఫ్‌డీలపై కన్నేసిన సందర్భంలో సాయికి బ్యాంకు మేనేజర్ల అవసరం వచ్చింది. అప్పుడే విశాఖకు చెందిన సాంబశివరావు ద్వారా కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధనను, రమణ ద్వారా మస్తాన్‌ వలీని రంగంలోకి దింపాలని నిర్ణయించాడు. సాయి చెప్పడంతో అప్పట్లో యోహాన్‌ రాజును కలిసిన రమణ తన పథకం వివరించి మస్తాన్‌ వలీని కలపాల్సిందిగా కోరాడు. దీంతో మస్తాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన యోహాన్‌.. రమణ వచ్చి కలుస్తాడని చెప్పాడు.

ఆపై సంతోష్‌నగర్‌ వెళ్లి మస్తాన్‌ వలీని కలిసిన రమణ.. తమ కుట్రలో భాగంగా చేశాడు. సాయిని కూడా తీసుకువెళ్లి వలీకి పరిచయం చేశాక కుంభకోణం కథ నడిపారు. అకాడమీ ఎఫ్‌డీల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో యోహాన్‌కు రూ.50 లక్షలు ఇచ్చారు. ఇందులో రూ.16 లక్షలు ప్రమీలారాణి ఖాతాలో జమ చేశాడు. ఏపీలో రూ.14.6 కోట్ల మేర జరిగిన ఆయిల్‌ ఫెడ్, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్ల స్కాంలోనూ సాయి, యోహాన్‌ల పాత్ర ఉంది. ఆ కేసుల్లో యోహాన్‌ రాజు, ప్రమీలను విజయవాడ సీసీఎస్‌ పోలీసులు అక్టోబర్‌ 21న అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిటీ సీసీఎస్‌ పోలీసులు యోహాన్, ప్రమీలను పీటీ వారెంట్ల హైదరాబాద్‌ తీసుకొచ్చి జైలుకు పంపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement