విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం

7 Sep, 2023 11:38 IST|Sakshi

నల్గొండ:  నార్కట్‌పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన దొంతరబోయిన శివాని(18), అమ్మనబోలుకు చెందిన అనుగూతల మనీషా(18) నల్లగొండలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శివాని, మనీషా ఇద్దరూ నార్కట్‌పల్లిలో ఇంటర్‌(బైపీసీ) ఒకే కళాశాలలో చదివారు. అప్పుడే వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఇంటర్‌ పూర్తయిన అనంతరం నల్లగొండలోని ప్రభుత్వ ఉమెన్స్‌ కాలేజీలో బీఎస్సీలో చేరారు. నల్లగొండలోనే ఎస్సీ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. నక్కలపల్లి గ్రామానికి చెందిన దొంతరబోయిన సైదులుకు ఒక కూతురు శివాని, ఒక కుమారుడు ఉన్నారు. 

తండ్రి గ్రామంలో వ్యవసాయకూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శివాని గ్రామంలోని హైసూ్కల్‌లో 10వ తరగతి వరకు చదివి ఇంటర్‌ నార్కట్‌పల్లిలో చదివింది. ఇదే మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన ఎనుగుత్తల మల్లయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు కాగా.. మనీష రెండో కూతురు. ఆమె 10వ తరగతి వరకు గ్రామంలోని హైసూ్కల్‌లో, ఇంటర్‌ నార్కట్‌పల్లిలో చదివింది. తండ్రి రోజువారి కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ‘నా బిడ్డను ఎవరో బెదిరించి సెల్‌ ఫోన్‌లో ఫొటోలు పెట్టారంట, అందుకే నా బిడ్డ గడ్డిమందు తాగి చనిపోయింది. నా బిడ్డను బెదిరించిన వాళ్లను పట్టుకోవాలి’ అని శివాని తల్లి రేణుక వేడుకుంది. ‘మా కూతురు  కాలేజికి పోతున్నా అని పొద్దున్నే వెళ్లిపోయింది. నల్లగొండలో గడ్డిమందు తాగి చనిపోయింది. ఫోన్‌ చేసి నాకు ఏమో అవుతుందని చెప్పింది. అంతే తప్ప ఏమైందో తెలియదు’ అని మనీష తల్లిదండ్రులు మల్లయ్య, యాదమ్మ చెప్పారు.

గ్రామాలకు చేరిన మృతదేహాలు  
శివాని, మనీషా మృతదేహాలకు బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మధ్యాహ్నం వారి గ్రామాలకు తరలించారు. మృతదేహాలను చూడగానే కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. గ్రామస్తులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. నక్కలపల్లిలో జరిగిన శివాని అంతిమ యాత్రలో ప్రజలంతా పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, మనీషా బాబాయ్‌ ముంబాయిలో ఉంటున్నందున ఆయన రాగానే మనీషా అంత్యక్రియలు అమ్మనబోలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పరామర్శ 
మృతుల కుటుంబ సభ్యులను ఆయా గ్రామాల్లో జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి పరామర్శించారు. మృతదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులరి్పంచారు. వీరి వెంట ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి,  సర్పంచ్‌లు ఈద మాదవి నర్సింహ్మ, బద్దం వరలక్ష్మి రాంరెడ్డి, ఎంపీటీసీలు కొంపెల్లి సైదులు, అంజయ్య, బాషపాక రవికుమార్‌ తదితరులు ఉన్నారు.    

మరిన్ని వార్తలు