ఆర్టీసీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

Published Mon, Aug 7 2023 4:00 AM

Unanimous approval of RTC bill in Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపిన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు కథ సుఖాంతమైంది. ఆదివారం ఉభయసభలు బిల్లును ఆమోదించాయి. ఆదివారం మధ్యాహ్నం వర­కు గవర్నర్‌ నుంచి ఈ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. కొన్ని అంశాలపై సూచనలు చేస్తూ.. గవర్నర్‌ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెట్టడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టగా సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

దీంతో పాటు బా­న్సువాడ మున్సిపాలిటీ నుంచి కోయగుట్ట తండా వార్డును, ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెం వార్డు­ను తొ­ల­గించి విడిగా గ్రామపంచాయతీలుగా చేస్తూ రెండు బిల్లులకు కూడా సభలు ఆమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన బిల్లులను మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, పీఆర్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సభ ముందు పెట్టారు. ఆర్టీసీ బిల్లుతో పా­టు ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలుపుతున్నట్టు శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. 

ఆస్తులు యధాతథంగా కార్పొరేషన్‌లోనే ఉంటాయి : మంత్రి అజయ్‌ 
సంస్థ ఆస్తులు యధాతథంగా ఆర్టీసీ కార్పొరేషన్‌లోనే ఉంటాయని మంత్రి అజయ్‌ స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంలో భాగంగా వారితో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించి త్వరలోనే నియమ, నిబంధనలను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పూర్తి పీఆర్‌సి వర్తిస్తుందని, టీఎస్‌ఆర్టీ కార్పొరేషన్‌ అనేది కొనసాగుతున్నందున ఆస్తులు, అప్పులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కార్పొరేషన్‌ చెలిస్తుందని, సీసీఎస్‌ బకాయిలు వంటివి దాని పరిధిలోకే వస్తాయని చెప్పారు. జీతభత్యాల వరకే ప్రభుత్వం చూస్తుందన్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలోనూ బిల్లు పాసయ్యాక వీలైనంత తొందరలో మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. ఆయా అంశాలపై ఉద్యోగులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 

43,055 మంది పర్మినెంట్‌ ఎంప్లాయిస్‌.. 
ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం 43,055 మంది పర్మినెంట్‌ ఎంప్లాయిస్‌కు సంబంధించినదని, 240 మంది కాంట్రాక్ట్‌ డెయిలీవేజ్‌ కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌.. కార్పొరేషన్‌ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా విధులో కొనసాగుతారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఐతే ఉద్యోగులకు భద్రత, సీసీఎస్‌ బకాయిలు, టీఏ బిల్లులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్,డెయిలీవేజ్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో స్పష్టత నివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కోరారు. వాటిపై స్పందిస్తూ మంత్రి అజయ్‌ వివరణనిచ్చారు. ఈ బిల్లుకు ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్‌ మద్దతు తెలిపారు.    

Advertisement
Advertisement