25న యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

23 Dec, 2020 10:21 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వా మి ఆలయంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి (పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 25న వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి వేడుకను కోవిడ్‌–19 నిబంధనలతో నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి మంగళవారం తెలిపారు. బాలాలయాన్ని ముక్కోటి ఏకాదశిన ఉదయం 3గంటలకు తెరిచి, ఉదయం 6.43 గంటలకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 6.43 నుంచి 9.30 గంటల వరకు వైకుంఠద్వార దర్శనంతోపాటు ఉదయ దర్శనాలు కల్పించనున్నట్లు ఈవో వెల్లడించారు. పాతగుట్ట ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి, 6.43 గంటలకు ఉత్తర ద్వారదర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అదేరోజు నుంచి బాలాలయంలో 30వ తేదీ వరకు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామన్నారు.

బలరాముడిగా భద్రాద్రి రామయ్య
భద్రాచలంటౌన్‌: భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం బలరామావతారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని అందంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో స్వామివారిని చిత్రకూట మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై ఆసీనున్ని చేసి పూజలు నిర్వహించారు. బలరామ అవతారంలో ఉన్న రామచంద్రున్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ముక్కోటి అలంకరణ:
ముక్కోటి ఏకాదశి వేడుకలకు భద్రాద్రి రామాలయం ముస్తాబైంది. వైకుంఠ అధ్యయనోత్సవాల్లో భాగం గా నిత్య పూజలతోపాటు రామయ్యను వివి ధ రూపాల్లో అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రామాలయాన్ని  విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు