పాడి రైతులకు శుభవార్త.. విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

30 Aug, 2022 00:53 IST|Sakshi

సెప్టెంబర్‌ 1 నుంచి పెరిగిన ధరలు వర్తింపు: మంత్రి తలసాని  

సాక్షి, హైదరాబాద్‌: విజయ డెయిరీ పాడి రైతులకు ప్రభుత్వం వినాయక చవితికి ముందే శుభవార్త చెప్పింది. ఈ డెయిరీకి పాలు పోసే రైతులకు చెల్లిస్తున్న పాల సేకరణ ధరను పెంచుతున్నట్టు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. గేదె పాలు లీటర్‌కు రూ.46.69 నుంచి రూ.49.40కు, ఆవుపాల ధరను లీటర్‌కు రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతామని, పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

సోమవారం రాజేంద్రనగర్‌లోని కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తలసాని మాట్లాడుతూ, పాలసేకరణ ధరతో పాటు డెయిరీ సొసైటీ నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా పెంచుతామని, ఈ పెంపు వల్ల ప్రతి నెలా డెయిరీపై రూ.1.42 కోట్ల మేరకు భారం పడుతుందని చెప్పారు.

అయినా పాడిరైతుల అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ ఇప్పుడు ఏటా రూ.800 కోట్ల టర్నోవర్‌ చేసే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం కింద అనేకమంది పాడి గేదెలను కొనుగోలు చేశారని, వారంతా విజయ డెయిరీకి పాలుపోసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సదస్సులో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విజయ డెయిరీ ఇన్‌చార్జి అధర్‌సిన్హా, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ రాంచందర్, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు