కావాల్సింది.. రూ. 80 వేల కోట్లపైనే ఇచ్చింది.. రూ. 53 వేల కోట్లు  | Sakshi
Sakshi News home page

కావాల్సింది.. రూ. 80 వేల కోట్లపైనే ఇచ్చింది.. రూ. 53 వేల కోట్లు 

Published Sun, Feb 11 2024 4:47 AM

Vote on Account Budget 2024 presented on Saturday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘ఆరు గ్యారంటీ’లను ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోగా పూర్తిస్థాయిలో అమలు చేయడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీల అమలుకు కనీసం రూ. 80 వేల కోట్లకుపైగా నిధులు అవసరమని అంచనాలు ఉండగా శనివారం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024–25లో ప్రభుత్వం రూ. 53,196 కోట్లనే ప్రతిపాదించింది. అందులోనూ ఏ హామీ అమలుకు ఎన్ని నిధులు కేటాయించిందీ స్పష్టత ఇవ్వలేదు.

ప్రాథమిక అంచనాల ప్రకారమే ఈ నిధులు కేటాయించామని, హామీలకు సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాక పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. 2 లక్షల రైతు రుణమాఫీని త్వరలోనే అమలు చేస్తామని ఆయన ప్రకటించినా పథకానికి నిధుల కేటాయింపులపైనా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల అమలు పాక్షికంగానే జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

మహాలక్ష్మికి రూ. 10 వేల కోట్లపైనే!
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకుపైగా పేద మహిళలకు కొత్తగా నెలకు రూ. 2,500 చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఏటా రూ. 6 వేల కోట్ల వ్యయం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్‌ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను రూ. 955కు విక్రయిస్తున్నారు.

రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లుండగా రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ను అందించడానికి ఏటా కనీసం రూ. 2,923.65 కోట్ల మేర గ్యాస్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్‌ ధర పెరిగిన కొద్దీ ఈ భారం పెరుగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడానికి సుమారు రూ. 2,200 కోట్ల వ్యయం కానుందని అంచనా. 

29 వేల కోట్లు కేటాయిస్తేనే  రైతులకు భరోసా..  
రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి ఏటా రూ. 15 వేల చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల చొప్పున ఆర్థిక సాయం, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతు కూలీలున్నట్లు అంచనా. వారికి రూ. 12 వేల చొప్పున ఇవ్వడానికి ఏటా రూ. 3 వేల కోట్లు అవసరం కానున్నాయి.

అలాగే ఎకరానికి రూ. 15 వేల చొప్పున 69 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు ఏటా రూ. 22,500 కోట్లు, 6 లక్షల మంది కౌలు రైతులకు ఏటా రూ. 3 వేల కోట్ల సాయం అందించాల్సి ఉంటుంది. ఏటా సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం సేకరిస్తుండగా టన్నుకు రూ. 500 చొప్పున రూ.750 కోట్లను ఇవ్వాల్సి ఉండనుంది. ఈ లెక్కన మొత్తం రైతు భరోసాకు ఏటా సుమారు రూ. 29 వేల కోట్లు అవసరం అని అంచనా.  

రూ.15 వేల కోట్లు ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దశలవారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాకే నిధులపై స్పష్టత రానుంది.

గతబీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద 15 లక్షల ఇళ్లులేని కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇళ్లులేని పేద కుటుంబాలు దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయని అంచనా వేయవచ్చు. ఐదేళ్ల టర్మ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మొత్తం 15 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలని నిర్ణయిస్తే ఏటా 3 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏటా 15 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. 

యువ వికాసానికి  10 వేల కోట్లు కావాలి 
విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతిమండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు విషయంలో ఏ స్థాయి విద్య కోసం ఎందరు విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారనే అంశంపై స్పష్టత వస్తేనే ఈ పథకం అమలుకు అవసరం కానున్న నిధులను అంచనా వేయడానికి వీలుంది. ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తే రూ. 10 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి.  
గృహజ్యోతికి 4,164 కోట్లు అవసరం..

గృహజ్యోతిపథకంకిందఇళ్లకు ప్రతి నెలా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ సరఫరాకు ఏటా రూ. 4,164.29 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేయగా తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 2,418 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్‌ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా అందులో 1.05 కోట్ల కనెక్షన్లు (87.9% గృహాలు) నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌నే వినియోగిస్తున్నాయి. తొలి విడతగా 35 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 

చేయూతకు 21 వేల కోట్లు అవసరం 
చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేల పెన్షన్, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆసరా పథకం కింద మొత్తం 43,68,784 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్‌ బాధితులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నారు. వారికి రూ. 4 వేల పెన్షన్‌ చెల్లిస్తే ఏటా సుమారు రూ. 20,970 కోట్లు అవసరం అవుతాయి. రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుకు అదనంగా నిధులు అవసరం కానున్నాయి.

పన్నుల్లో వాటా పెంచారు..గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ తగ్గించారు 
కేంద్రం చేయూతపై రాష్ట్ర బడ్జెట్‌లో భిన్న ప్రతిపాదనలు 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం అందించే చేయూత విషయంలో ఈసారి బడ్జెట్‌లో భిన్న ప్రతిపాదనలు కనిపించాయి. పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై పూర్తిస్థాయి విశ్వాసాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల విషయంలో మాత్రం ఆచితూచి కేటాయింపులు చూపెట్టింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా కింద రూ.25,369 కోట్ల పైచిలుకు నిధులు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనా మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2024–25 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కేంద్ర పన్నుల్లో వాటా పద్దు కింద రూ.25,639.84 కోట్లు చూపెట్టింది. కానీ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల విషయంలో మాత్రం చాలా తక్కువ అంచనాలను చూపెట్టింది.  

గత అనుభవాలకు అనుగుణంగానే..
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విషయంలో చాలా తక్కువగా నిధులు వస్తాయన్న రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు గత అనుభవాలే కారణమని అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద నిధులు చాలా తక్కువగా వస్తున్నాయి. 2023–24 విషయానికి వస్తే ఈ పద్దు కింద రూ. 41,259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో అంచనా వేసింది. కానీ, వాస్తవానికి వచ్చింది రూ.13,953 కోట్లు మాత్రమేనని ఈ బడ్జెట్‌ సవరించిన అంచనాల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఇదే పరిస్థితి గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే 2024–25 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దును కేవలం రూ.21,075.15 కోట్లకు మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. ఇక, పన్నుల్లో వాటా కింద గత ఏడాది ప్రతిపాదనలు రూ. 21,470 కోట్లు కాగా, అంతకంటే దాదాపు రూ.2వేల కోట్లు ఎక్కువగా వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అంచనా వేసింది.

జాతీయ, రాష్ట్ర స్థూల ఉత్పత్తుల పెరుగుదల నేపథ్యంలో పెరిగిన పన్ను రాబడుల కారణంగా ఈ మేరకు పన్నుల్లో వాటా పెరిగింది. పన్ను రాబడులు దేశవ్యాప్తంగా ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో పన్నుల్లో వాటా కింద కేంద్ర అంచనాలు రూ.25వేల కోట్ల పైచిలుకు ఉండగా, ఆ ప్రతిపాదనలకు మరికొంత అదనంగా రాష్ట్ర బడ్జెట్‌లో చూపెట్టి ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉందనే అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

పల్లెకు పెద్ద పీట!
పంచాయతీరాజ్‌ శాఖకు రూ.40,080 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: తాజా బడ్జెట్‌లో పంచాయతీరాజ్, ,గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్, ఆర్‌డీ)కు అత్యధికంగా రూ.40,080 కోట్లు కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోకి వచ్చే వివిధ కేటగిరిల పింఛన్‌ దారులకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు, దివ్యాంగులకు పింఛన్‌ పెంపుదల, అదే విధంగా మహాలక్ష్మి పథకంలోని 18–58 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు (వృద్ధాప్య పింఛన్లు వర్తించని వారికి) నెలకు రూ.రెండున్నర వేల చొప్పున ఆర్థికసాయం కూడా ఉన్నాయి.

అందువల్ల ఈ స్కీంలకు కేటాయించే మొత్తాలను కూడా కలిపితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అంటే పల్లెకే అత్యంత ప్రాధాన్యం కల్పించినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆసరా పింఛన్లు, మహిళలకు డ్వాక్రా రుణాలు, ఉపాధి హామీ, రోడ్లు, గ్రామపంచాయతీలు, వడ్డీలేని రుణాలు, ఇతర పథకాలకు ఎంతెంత మొత్తాన్ని కేటాయించారనే దానిపై మాత్రం స్పష్టత కొరవడిందని అంటున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2023–24 బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు. 

ఆర్టీసీ ‘జీరో టికెట్‌’.. 
నెలకు రూ.300 కోట్లు కేటాయింపు..
సాక్షి, హైదరాబాద్‌: ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆర్టీసీకి ప్రతినెలా రూ.300 కోట్లు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈసారి బడ్జెట్‌ పద్దులో ఆ నిధులకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వలేదు. నెలకు రూ.300 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్టు మాత్రం పేర్కొంది. గతంలో రెండు పర్యాయాలు ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయిస్తూ వచ్చారు. అందులో రూ.850 కోట్లు బస్‌పాస్‌ల రాయితీ మొత్తాన్ని రీయింబర్స్‌ చేసేవి కాగా, మిగతావి గ్రాంటు రూపంలో అందించేవి.

బడ్జెట్‌ ప్రసంగం అనంతరం మధ్యాహ్నం 100 కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి సీఎం హాజరు అవుతున్నారని తెలియటంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమైంది. సీఎం స్వయంగా కొన్ని వరాలు ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ 2013 వేతన సవరణ బాండు బకాయిలకు సంబంధించి 280 కోట్ల విడుదల అంశాన్ని మాత్రమే ఆయన ప్రకటించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.  

రోడ్లకు అరకొరే..
ప్రణాళిక పద్దు కింద రూ.1,018 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అత్తెసరు నిధులే దక్కాయి. రాష్ట్ర రహదారుల్లో ప్రణాళిక పద్దు కింద రూ.1,018 కోట్లు  ప్రతిపా దించారు. ఇది గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో సగం మాత్రమే కావటం విశేషం. ఇప్ప టికీ కాంట్రాక్టర్లకు 700 కోట్ల వరకు పాత బకాయిలున్నాయి. అవిపోను కొత్త రోడ్లకు ఈ నిధులు సరిపోయేలా లేవు. రాష్ట్ర రహదా రులకు రూ.4 వేల కోట్లు కావాలని ఆ శాఖ కోరింది. అందులో సగం కూడా దక్కలేదు. జిల్లా కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఇతర భవనాల నిర్మాణానికి కూడా భారీగా నిధులు కావాల్సి ఉంది. భవనాల పద్దు కింద రూ.800 కోట్లు కేటాయించినట్టు తెలిసింది.

రాష్ట్రంలో నాలుగోసారి.. భట్టి తొలిసారి 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాలుగో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. తొలి రెండు టర్మ్‌లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి ముగ్గురు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి అయిన ఈటల రాజేందర్‌ 2014 నుంచి 2018 వరకు వరుసగా బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

తర్వాత 2019 సెపె్టంబర్‌ 9న అప్పటి సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు ఆర్థిక శాఖను కేసీఆరే పర్యవేక్షిస్తున్నారు. 2020 నుంచి 2023 వరకు టి.హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తాజాగా కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన భట్టి నాలుగో ఆర్థిక మంత్రిగా నిలిచారు. 

Advertisement
Advertisement