వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ రద్దు | Sakshi
Sakshi News home page

వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ రద్దు

Published Tue, May 31 2022 5:24 AM

Warangal ORR Land Pooling Cancelled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ /వరంగల్‌ అర్బన్‌:    వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ (భూసమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 41 కిలోమీటర్ల వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు సర్వే పనులను ప్రారంభించింది. అయితే ల్యాండ్‌ పూలింగ్‌కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో ఐదు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు.

దీంతో ఇటీవల ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ పి.ప్రావీణ్య భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చారు. అయినప్పటికీ రైతులు ఆందోళనలు కొనసాగించారు. రహదారుల దిగ్బంధనం చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ హైదరాబాద్‌లో మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌కుమార్‌ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement