మొదలైన వెబ్‌ ఆప్షన్లు!

19 Oct, 2020 02:41 IST|Sakshi

ఇంజనీరింగ్‌లో 97,741 సీట్లకు అనుబంధ గుర్తింపు

ఆదివారం రాత్రి జారీచేసిన యూనివర్సిటీలు

కన్వీనర్‌ కోటాలో 69,365 సీట్లు

యాజమాన్య కోటాలో 28,376 సీట్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్‌ ఆప్షన్లు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 176 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 97,741 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును జారీ చేశాయి. శనివారం ప్రభుత్వం కొత్త కోర్సుల్లో సీట్లకు ఆమోదం తెలుపగా, ఆదివారం మధ్యాహ్నం వరకు యూనివర్సిటీలు కొత్త కోర్సులతోపాటు పాత కోర్సులకు అనుబంధ గుర్తింపును జారీ చేస్తాయని ప్రవేశాల క్యాంపు అధికారులు, యాజమాన్యాలు ఎదురుచూశాయి. చివరకు ఆదివారం రాత్రి జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపును ఇస్తూ కాలేజీల వారీగా బ్రాంచీలు, ఆయా బ్రాంచీల్లో సీట్ల వివరాలను ప్రవేశాల కమిటీలకు అందజేశాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులను బట్టి 176 కాలేజీల్లో 97,741 సీట్లకు ఆమోదం తెలిపినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు.

దీంతో ప్రవేశాల క్యాంపు కార్యాలయం సీట్‌ మ్యాట్రిక్స్‌ రూపొందించి ఆదివారం అర్ధరాత్రి తరువాత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. మొత్తం 176 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 69,365 సీట్లను (14 యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం... 3,152 సీట్లు) భర్తీ చేయనుంది. కన్వీనర్‌ కోటాలో సీట్ల కోసం విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. అయితే ఆప్షన్లు ఇచ్చేప్పుడు కాలేజీల ప్రాధాన్యం పక్కాగా చూసుకోవాలని, తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచీలను ఎంచుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. ఇక మరో 28,376 సీట్లను 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో (అందులో 15 శాతం ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా) యాజమాన్యాలు భర్తీ చేయనున్నాయి.  

25 కాలేజీలు.. 13,132 సీట్లకు కోత 
రాష్ట్రంలోని 201 కాలేజీల్లోని 1,10,873 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలుపగా, అందులో 176 కాలేజీల్లో 97,741 సీట్లకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు జారీ చేశాయి. అంటే 25 కాలేజీల్లోని 13,132 సీట్లకు యూనివర్సిటీలు కోత పెట్టాయి. అందులో 14 కాలేజీలు మూత పడగా, మరో 11 కాలేజీల్లో సీట్లు తగ్గిపోయాయి.  

కోర్సుల వారీగా జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపు ఇచ్చిన ప్రధాన బ్రాంచీల సీట్లు 
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మిషన్‌ లెర్నింగ్‌ – 6960, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ – 180, సైబర్‌ సెక్యూరిటీ – 2580, డేటా సైన్స్‌ – 4500, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ – 1770, కంప్యూటర్‌ సైన్స్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ – 360, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ (నెట్‌వర్క్స్‌) – 120, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ – 300, సీఎస్‌ఐటీ – 480, కంప్యూటర్‌ సైన్స్‌ – 20913, ఈసీఈ – 16893, ఈఈఈ – 8130, సివిల్‌ – 7140, మెకానికల్‌ – 6648, ఐటీ – 4980, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ – 300, కెమికల్‌ ఇంజనీరింగ్‌ – 120, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ – 240, మెటలర్జి – 360, మైనింగ్‌ – 60, ఆటోమొబైల్‌ – 60, బయోమెడికల్‌    – 30, కంప్యూటర్‌ సైన్స్‌ టెక్నాలజీ – 60, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ – 300, ఈటీఈ – 60, ఐటీ అండ్‌ ఇంజనీరింగ్‌ – 60, మెకట్రానిక్స్‌ – 60.     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు