Sakshi News home page

ఐసీడీఎస్‌ వారి పెళ్లిపిలుపు 

Published Mon, Aug 28 2023 6:27 AM

Wedding invitation of ICDS - Sakshi

సాక్షి, కామారెడ్డి:  ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాలికను మహిళా శిశు సంక్షేమ శాఖ అక్కున చేర్చుకుంది. కామారెడ్డిలోని బాలసదనంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించింది. ఆమెకు యుక్త వయసు రావడంతో అన్నీ పరిశీలించి, సంబంధం కుదిర్చారు. జిల్లా అధికారులే పెళ్లి పెద్దలుగా మారి ఆమెను పెళ్లిపీటలు ఎక్కించబోతున్నారు. ఈ అపురూప సన్నివేశం సోమవారం సదాశివనగర్‌ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో సోమవారం ఆవిష్కృతం కాబోతోంది.  

అలా జత కలిసింది.. 
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి అనాథలయిన రూప, ఆమె చెల్లెలిని ఐసీడీఎస్‌ అధికారులు చేరదీసి, బాలసదనంలో చేర్పించారు. రూప పదో తరగతి పూర్తి చేశాక మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ కోర్సు చదివించారు. ఇటీవలే కోర్సు పూర్తి చేసింది. రూప చెల్లెలు ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కోర్సు చదువుతోంది.  

ఇదే సమయంలో ధర్మారావుపేట గ్రామానికి చెందిన అనిల్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి వచ్చారు. ఆయనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో బాలసదనంలో పెరుగుతున్న రూప గురించి ఎవరో చెప్పడంతో అధికారులతో మాట్లాడాడు. రూప, అనిల్‌ ఇరువురూ పరస్పరం ఇష్టపడడంతో అధికారులు పెళ్లి చేయడానికి నిర్ణయించారు. వరుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాక.. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియనంతా పూర్తి చేశారు.  

ఆహ్వానించేది అధికారులే.. 
రూప, అనిల్‌ల వివాహం కోసం ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’పేరుతో ఆహ్వాన పత్రిక ముద్రించారు. పత్రికలో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి పేర్లు, వివరాలు, వివాహం జరుగు స్థలం పొందుపరిచారు. అధికారులే పెళ్లి పెద్దలుగా మారారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్, జిల్లా సంక్షేమ అధికారి పి.రమ్య, డీసీపీవో జె.స్రవంతి, బాలసదనం సూపరింటెండెంట్‌ కే.సంగమేశ్వ­రి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు.  

నేడు వివాహం..: రూప, అనిల్‌ల వివాహం సోమవారం జరగనుంది. సదాశివనగర్‌ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలోగల రెడ్డి సంఘ భవనం ఈ వివాహానికి వేదిక అవుతోంది. రూప పెళ్లికి జిల్లా స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. వివాహ ఖర్చును పెళ్లి కొడుకే భరిస్తుండగా.. కావలసిన సామగ్రి, బంగారం, దుస్తులను అధికారులు సమకూరుస్తున్నారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ తదితరులు హాజరవుతారని ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు.    

Advertisement

What’s your opinion

Advertisement