గగనంలో అద్భుత వీక్షణకు 

18 Jan, 2024 05:42 IST|Sakshi

నేటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్‌ ఇండియా–2024 

నాలుగు రోజులపాటు లోహ విహంగాల సందడి 

106 దేశాల నుంచి 1,500 మంది డెలిగేట్స్‌ 

మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తరువాత

రెండు రోజులు సామాన్యులకు అనుమతి  

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): గగనంలో గగుర్పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్‌ ఇండియా–2024కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్‌ ఇండియా–2024 ప్రారంబోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తోపాటు ఎయిర్‌ ఇండియా మొదటి హెలికాప్టర్‌ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు (18, 19 తేదీలు) వ్యాపార, వాణిజ్యవేత్తలను, ఆ తరువాత రెండు రోజులు (20, 21 తేదీలు) సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 5,000 మంది బిజినెస్‌ విజిటర్స్‌ పాల్గొననున్నట్లు అంచనా. 

ఫ్లయింగ్‌ డిస్‌ప్లే సమయం పెరిగిందోచ్‌.. 
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్‌ టీమ్‌తోపాటు మార్క్‌ జాఫరీస్‌ బృందం చేసే వైమానిక విన్యాసాలను కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. గతంలో ఫ్లెయింగ్‌ డిస్‌ప్లే సమయాన్ని కేవలం 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు నిర్వహించగా, ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా విచ్చేయనున్న దృష్ట్యా ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు.  

సారంగ్‌ టీమ్‌ వచ్చేసింది.. ముగ్గురు హైదరాబాదీలే.. 
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్‌ టీమ్‌ మరోసారి తమ వైమానిక విన్యాసాలు ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్‌ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఈ టీమ్‌ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదు హెలికాప్టర్లతో ఏరోబాటిక్స్‌ ప్రదర్శించే ఈ బృందానికి సీనియర్‌ గ్రూప్‌ కెపె్టన్‌ ఎస్‌కే మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఏరోబాటిక్స్‌ ప్రదర్శన చేసే ఐదుగురిలో ముగ్గురు హైదరాబాదీలే కావడం విశేషం. హైదరాబాదీలైన వింగ్‌ కమాండర్లు టీవీఆర్‌ సింగ్, అవినాష్‌ సారంగ్‌ టీమ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ టీమ్‌ 350 షోలకు పైగా నిర్వహించి రికార్డు సృష్టించింది.  

వైమానిక విన్యాసాల వేళలు

  • 18వ తేదీన మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, 4.15–5 గంటల వరకు 
  • 19న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు. అనంతరం డ్రోన్‌ షో జరగనుంది. 
  • 20న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు.. 
  • 21న ఉదయం 11–11.45 వరకు, మధ్యాహ్నం 3–3.45 వరకు, సాయంత్రం 5–5.45 వరకు 
>
మరిన్ని వార్తలు