ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేదు.. అధిక సంఖ్యలో పారాసిటమాల్‌ మాత్రలు తీసుకుని

14 Nov, 2021 20:47 IST|Sakshi

సాక్షి, జీడిమెట్ల: కడుపునొప్పి భరించలేక పారాసిటమాల్‌ మాత్రలు పెద్ద మొత్తంలో తీసుకున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా శంకర్‌నగర్‌కు చెందిన చేకూరి రాజు, లక్ష్మి(45) భార్యాభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి షాపూర్‌నగర్‌ సమీపంలోని సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముంటూ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా లక్ష్మి గత రెండేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతోంది.

పలు ఆస్పత్రిలో చూపించి నా నొప్పి నయం కాలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 25న కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో భరించలేక లక్ష్మి ఇంట్లో ఉన్న పారాసిటమాల్‌ మాత్రలను ఎక్కువ మొత్తంలో తీసుకుంది. దీంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతున్న లక్ష్మి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
(చదవండి: చలో నల్లమల.. 17 నుంచి టూర్‌ ప్రారంభం)  

మరిన్ని వార్తలు