సప్తగిరుల ప్రదక్షిణ అసాధ్యం | Sakshi
Sakshi News home page

సప్తగిరుల ప్రదక్షిణ అసాధ్యం

Published Sat, Dec 2 2023 7:40 AM

మాట్లాడుతున్న ఈఓ ధర్మారెడ్డి    - Sakshi

తిరుమల : తిరువణ్ణామలై, మధురలో ఒక కొండ మాత్రమే ఉందని, తిరుమల క్షేత్రం సప్తగిరులపై వెలసిందని, కావున గిరి ప్రదక్షిణ సాధ్యం కాదని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అయితే తిరుమల ఇన్నర్‌రింగ్‌రోడ్డు, ఔటర్‌రింగ్‌ రోడ్డు ద్వారా భక్తులు శ్రీవారి ఆలయ ప్రదక్షిణ చేయవచ్చని సూచించారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన ఈశ్వర్‌ అనే భక్తుడు మాట్లాడుతూ అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ క్రమంలో మరికొందరి భక్తుల ప్రశలకు ఈఓ సమాధానమిచ్చారు.

వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఎప్పటి నుంచి ఇస్తారు. – శ్రీనివాస్‌, ప్రొద్దుటూరు

ఈఓ : డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 4.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదంతోపాటు అక్షింతలు కూడా ఇవ్వండి. విశాఖపట్నంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం కల్పించండి. – అప్పన్న, వైజాగ్‌

ఈఓ : శ్రీవారి కల్యాళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు అక్షింతలు అందజేస్తున్నాం. దర్శనానంతరం అక్షింతలు అందించే విషయమై ఆగమ సలహామండలితో చర్చిస్తాం. విశాఖపట్నంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశాన్ని త్వరలోనే కల్పిస్తాం.

వరంగల్‌లోని పురాతన శ్రీరంగనాథ స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు టీటీడీ తరఫున సహకారం అందించండి. – విజయలక్ష్మి, హైదరాబాద్‌

ఈఓ : శ్రీవాణి ట్రస్ట్‌ నుంచి సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

వైకుంఠ ఏకాదశికి తిరుమల, తిరుపతిలో గదులను ఆన్‌లైన్‌లో విడుదల చేయలేదు. లక్కీడిప్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయండి. వృద్ధులు, వికలాంగులతోపాటు ఒక సహాయకుడిని అనుమతించండి.

– శంకర్‌ గౌడ్‌, హైదరాబాద్‌

ఈఓ : డిసెంబరు 23, 24వ తేదీలకు గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ లేదు. తిరుమల సీఆర్‌ఓ కార్యాలయం వద్ద పేర్లు నమోదు చేసుకుని గదులు పొందవచ్చు. ఆన్‌లైన్‌లో లక్కీడిప్‌ సేవా టికెట్లు ఇవ్వడం వీలుకాదు.

25 ఏళ్ల ముందే దూరదృష్టితో ఆలయ మాడ వీధులను విస్తరించి అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అభినందనలు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టుకు ప్రత్యేకాధికారిని నియమించండి. ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలను చేపట్టండి.

– ధనుంజయ్‌, చైన్నె

ఈఓ : 2004– 06 ఏళ్లలో తిరుమలలోని నాలుగు మాడ వీధులను విస్తరించి, గ్యాలరీలు ఏర్పాటు చేశాం. ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టుకు కాంట్రాక్టు పద్ధతిలో అధికారి ఉన్నారు. ధనుర్మాసంలో 30 రోజులు పాటు 30 పాశురాలను అర్థతాత్పర్యాలతో పెద్దజీయర్‌ మఠం నుంచి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం.

తిరుమలలో లగేజీ కౌంటర్ల వద్ద డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవ్వలేదని బ్యాగ్‌లు విసిరేస్తున్నారు.

– కుమార్‌, రాజమండ్రి

ఈఓ : ఇలాంటి విషయాల్లో భక్తులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం

తిరుమల నాదనీరాజనం వేదికపై సంకీర్తనలు పాడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే శ్రీవారి గర్భగుడిలో గాయకులకు పాడే అవకాశం కల్పించండి. – విశ్వనాథ్‌, బెంగళూరు

ఈఓ : శ్రీవారి ఆలయంలో వేద పారాయణం మాత్రమే ఉంటుంది. ఏకాంత సేవలో మాత్రమే అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడం జరుగుతుంది. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ సదా భార్గవి, సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్‌, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ–2 జగదీశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

– డయల్‌ యువర్‌ ఈఓలో

టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

Advertisement
Advertisement