ఏడాదిగా కాళ్లకు స్టీల్‌ రాడ్లతో.. | Sakshi
Sakshi News home page

ఏడాదిగా కాళ్లకు స్టీల్‌ రాడ్లతో..

Published Fri, Jul 23 2021 12:52 AM

A woman Tragedy With Road Accident - Sakshi

ములకలపల్లి: సాఫీగా సాగుతున్న కుటుంబంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. భర్త పట్టించుకోకపోవడంతో ఏడాదిగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మహేశ్‌ ఇల్లందుకు చెందిన మౌనికను ఐదేళ్ల కింద వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరు అనారోగ్యంతో చనిపోయారు.

ఏడాది కింద మౌనిక ములకలపల్లి వెళ్లి వస్తుండగా బైక్‌ ఢీకొట్టడంతో మౌనిక కాలికి తీవ్రగాయమైంది. దీంతో ఆమెను వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, ఆపరేషన్‌ చేసిన వైద్యులు కాలులో స్టీల్‌ రాడ్లు అమర్చారు. 15 రోజుల తర్వాత తొలగించాల్సి ఉండగా, కొన్ని రోజులు బాగానే చూసుకున్న భర్త మహేశ్, అత్తమామలు లక్ష్మి, ఏసురత్నం ఆ తర్వాత ఆమెను, ఆమె కుమారుడిని వదిలేశారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక గత్యంతరం లేక కాలికి ఉన్న స్టీల్‌ రాడ్‌తోనే ఏడాదిగా గ్రామంలోని ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేస్తోంది.

రాత్రి వేళ ఇళ్ల అరుగులు, చెట్ల కింద తలదాచుకుంటోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వానలకు, కాలికి ఉన్న రాడ్లతో నడవలేక ఆమె ఇబ్బంది పడుతుండటాన్ని గురువారం చూసిన ఎస్సైలు బాల్దె సురేశ్, నాగభిక్షం ఆమె వివరాలు సేకరించారు. మౌనిక భర్త మహేశ్‌ సెంట్రింగ్‌ పని కోసం పాల్వంచ వెళ్లగా ఫోన్‌లో మాట్లాడారు. ఆమె అత్తమామలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పలుమార్లు ఇంటికి రావాలని కోరినా మౌనిక స్పందించలేదని ఆమె అత్త తెలిపింది. దీంతో మౌనికను ఆటోలో ఆమె ఇంటికి తరలించారు. మౌనిక కాలికి ఉన్న రాడ్లు తొలగించేందుకు సహకరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.  

Advertisement
Advertisement