● ఎస్వీ జూపార్క్‌లో అధికారుల నిర్లక్ష్యం ● వసతుల కల్పనలో అడుగడుగునా అలసత్వం ● జంతువుల సంరక్షణపై పర్యవేక్షణ శూన్యం ● ఇరుకు గదిలో ఉంచడమే పులిపిల్ల మృతికి కారణం | Sakshi
Sakshi News home page

● ఎస్వీ జూపార్క్‌లో అధికారుల నిర్లక్ష్యం ● వసతుల కల్పనలో అడుగడుగునా అలసత్వం ● జంతువుల సంరక్షణపై పర్యవేక్షణ శూన్యం ● ఇరుకు గదిలో ఉంచడమే పులిపిల్ల మృతికి కారణం

Published Thu, Jun 1 2023 1:06 AM

- - Sakshi

తిరుపతి మంగళం : ఎస్వీ జంతు ప్రదర్శనశాల (జూపార్క్‌)కు నిత్యం పెద్దసంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. శ్రీవారి దర్శనార్థం వచ్చేవారితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. జూ పార్క్‌లక్ష సుమారు 1,100 రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. వీటి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించడంలో మాత్రం అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పెరిగిన ఎండ తీవ్రత నేపథ్యంలో జంతువులు ఉపశమనం పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అలసత్వం చూపినట్లు తెలుస్తోంది.

పాపం పులిపిల్లలు!

ఆత్మకూరు జూ నుంచి మార్చి 10వ తేదీన నాలుగు పులిపిల్లలను తిరుపతి ఎస్వీ జూపార్క్‌కు తీసుకువచ్చారు. ఇక అప్పటి నుంచి వాటిని సంరక్షణ పేరుతో గాలి, వెలుతురు సక్రమంగా లేని చిన్నపాటి గదిలో ఉంచేశారు. సాధారణంగా జంతువులను ఇతర ప్రాంతాల నుంచి జూపార్క్‌కు తీసుకువచ్చినప్పుడు ఒక నెలపాటు పర్యవేక్షణ గదిలో ఉంచి, తర్వాత ఎన్‌క్లోజర్స్‌లోకి వదులుతుంటారు. అయితే పులి పిల్లలను మాత్రం ఇరుకు గదిలోనే ఉంచేయడంతో అవి మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఒక పులిపిల్ల అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు సమాచారం. పులి పిల్లలను నిత్యం పర్యవేక్షించే వైద్యుడు సైతం వాటిని ఎన్‌క్లోజర్స్‌లోకి మార్చాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, జూ క్యూరేటర్‌కు సూచించినా పట్టించుకోనట్లు తెలిసింది. వారి నిర్లక్ష్యం కారణంగా పులి పిల్ల మరణించినట్లు వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఒక నెమలి, రెండు బూడిదరంగు కోళ్లు కూడా మృత్యువాత పడినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement