శ్రీహరి కరుణ | Sakshi
Sakshi News home page

శ్రీహరి కరుణ

Published Sun, Aug 6 2023 1:34 AM

- - Sakshi

ఆ కలియుగ వేంకటేశ్వరుడికి సేవచేసే భాగ్యం దక్కడం అత్యంత అరుదు. అదే రెండో పర్యాయం ఆ స్వామికి సేవ చేయడమంటే నిజంగా అదృష్టమే. అది ఆ శ్రీహరి కరుణే! ఈ అరుదైన అవకాశం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి దక్కింది. ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో భూమన టీటీడీ చైర్మన్‌గా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.   

తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోమారు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆయన స్థానంలో ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా భూమన చేతికి టీటీడీ పగ్గాలు రావడం ఇది రెండోసారి. 2006–2008 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్‌గా కొనసాగారు.

సంస్కరణలకు మారుపేరు భూమన
గతంలో భూమన కరుణాకరరెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చి టీటీడీ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. ఇందులో కొన్ని విశేష ఆదరణ పొంది దేశవిదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాయి. అందులో మచ్చుకు కొన్ని..

దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అసమానతలు, అంటరానితనాన్ని నిర్మూలించడానికి భూమన నడుంబిగించారు. దళితవాడల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి దేవుడి వద్ద అందరూ సమానమనే భావన సమాజానికి చాటిచెప్పారు.

కల్యాణోత్సవాలు సైతం నిర్వహించారు. అప్పట్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పేదలైన శ్రీవారి భక్తులు వివాహాన్ని చేయలేని స్థితిలో ఉన్న వారి కోసం కల్యాణమస్తు అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసి ఏడాదిలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించారు.

శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేలా 2007లో ఎస్వీబీసీ భక్తి చానల్‌ను స్థాపించారు. ఇది దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం నాలుగు భాషల్లో భక్తులకు శ్రీవారి వైభవాన్ని ప్రసారం చేస్తోంది.

► చైతన్య రథయాత్ర, ఎస్వీబీసీ చానల్‌ ఏర్పాటు, విద్యాధన పథకం, టీటీడీ స్కూల్‌ పిల్లలకు ఉచిత పుస్తకాలు, మహిళా క్షురకులు, షెడ్యూల్‌ కులాలకు చెందిన వారికి అర్చకులుగా ట్రైనింగ్‌, ఉచిత లడ్డూ, శ్రవణం ప్రాజెక్ట్‌, పీఠాధిపతులతో ధార్మిక సదస్సులు, రాజంపేట సమీపంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం ఇలా.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.

అరుదైన అవకాశం
ముఖ్యమంత్రులైన తండ్రీకొడుకుల వద్ద టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అరుదైన అవకాశం భూమనకు దక్కింది. ఆయన వైఎస్‌ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. ప్రజాప్రస్థానం పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. 2006 నుంచి రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్‌గా కొనసాగారు. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు.

ఈనేపథ్యంలో 2012 ఉప ఎన్నికల్లో.. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున తిరుపతి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనపై నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు టీటీడీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు.ఆ కలియుగ వేంకటేశ్వరుడికి సేవచేసే భాగ్యం దక్కడం అత్యంత అరుదు. అదే రెండో పర్యాయం ఆ స్వామికి సేవ చేయడమంటే నిజంగా అదృష్టమే.

అది ఆ శ్రీహరి కరుణే! ఈ అరుదైన అవకాశం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి దక్కింది. ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో భూమన టీటీడీ చైర్మన్‌గా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement