Sakshi News home page

మేమేమి చేశాము పాపం?

Published Sun, Aug 13 2023 1:12 AM

- - Sakshi

బుడిబుడి అడుగులు వేస్తూ.. కేరింతలు కొడుతూ.. అందర్నీ దాటుకుంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతున్న కుమార్తెను చూసి ఉప్పొంగిపోయారు. ఆ గోవిందుడిని స్మరిస్తూ.. ముందు వెళ్తున్న కుమార్తెను గమనిస్తూ.. ముందుకు సాగారు. ఇంతలో బాలిక హఠాత్తుగా అదృశ్యమవ్వడంతో తల్లిదండ్రులు ఒకింత గందరగోళానికి లోనయ్యారు. ఎక్కడుందోనన్న ఆత్రుతతో చీకటిని చీల్చుకుంటూ వెతుకులాడడం ప్రారంభించారు.

నిశీధిలో రెప్ప వాల్చకుండా ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉంటుందని ఎదురుచూశారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. వన్యమృగాల దాడిలో చిన్నారి మృతిచెందిందని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మా ఇంటి మహాలక్ష్మిని తీసుకెళ్లావా..దేవుడా! అంటూ గుండెలవిసేలా రోదించారు. అక్క ఎక్కడుందమ్మా..? అంటూ తమ్ముడు అడిగే మాటలకు ఆ తల్లి జవాబు చెప్పలేక కన్నీరుమున్నీరవుతూ విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. ఈ విషాద ఘటన రుయా ఆస్పత్రి వద్ద శనివారం కనిపించింది.

సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి నడక మార్గంలో శుక్రవారం రాత్రి ఘోరం చోటుచేసుకుంది. వన్యమృగం దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందడం అందరినీ కలిచివేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, పోతిరెడ్డిపాళెంకు చెందిన దినేష్‌కుమార్‌, శిశికళ కుమార్తె లక్షిత(6) శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫారెస్ట్‌ సిబ్బంది జల్లెడ పట్టారు. శనివారం తెల్లవారు జాము నుంచి మరోమారు గాలింపు చేపట్టగా.. అలిపిరి నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయానికి వంద నుంచి 200 మీటర్ల దూరంలో ఓ బండరాయిపై లక్షిత మృతదేహం లభ్యమైంది.

క్రూరం..ఘోరం
చిన్నారి లక్షితను వన్యమృగాలు అతికిరాతకంగా హతమార్చినట్టు తెలుస్తోంది. మెడ, తల భాగాన్ని.. కుడి కాలు తొడ భాగంలోని కండను పూర్తిగా తినేయడంతో భయానకంగా మారింది. చిన్నారి మృతదేహాన్ని ఉదయం 7.55 గంటలకు తిరుపతి రుయా ఆస్పత్రి తీసుకొచ్చారు. 15 నిమిషాల పాటు డాక్టర్లు పరిశీలించి శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు. ఎస్వీ మెడికల్‌ కళాశాల ఫోరెన్సిక్‌ విభాగ వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఉదయం 11.05 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు టీటీడీ అంబులెన్స్‌ సిద్ధం చేసింది.

కొంప ముంచిన బెలూన్‌!
సీసీ ఫుటేజ్‌ పరిశీలించిన అధికారులు చిన్నారి హుందాగా.. వేగంగా ఆడుకుంటూ తల్లిదండ్రులకంటే ముందే మెట్లెక్కడం కనిపిచింది. ఈ క్రమంలో ఆంజనేయస్వామి విగ్రహం తర్వాత ఓ దుకాణం వద్ద బిస్కెట్‌ ప్యాకెట్‌ను కొనిచ్చారు. వాటిని తింటూ చిన్నారి ముందుకు సాగింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో చిన్నారి కనిపించకుండా పోయింది. బెలూన్‌తో ఆడుకుంటున్న సమయంలో గాలికి ఆ బెలూన్‌ మెట్లమార్గం దాటి వెళ్లడం.. దానికోసం పరుగులు తీసేక్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల మాటున దాగి ఉన్న క్రూరమృగం పాపను ఎత్తుకెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు.

రుయాలో మిన్నంటిన ఆర్తనాదాలు
రుయా మార్చురీ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డ దక్కకుండా పోయిందంటూ తల్లి శశికళ గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నారి నానమ్మ మనుమరాలితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దేవుడా..! ఇంత శిక్షవేశావేంటయా... అంటూ విలపించడం కలిచివేసింది. అక్క ఎక్కడమ్మా?..అంటూ తమ్ముడు లిఖిత్‌ అడుగుతుండడంతో తల్లి సమాధానం చెప్పలేక.. ఇంకెక్కడ అక్క నాయనా! దేవుడు తీసుకెళ్లి పోయాడురా అంటూ.. కన్నీరుమున్నీరైంది. మా ఇంటి మహాలక్ష్మి ఇక లేదన్న విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలంటూ తల బాదుకుంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.

దాడి చేసింది చిరుతేనా?
వన్యమృగం చిన్నారి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. చూడడానికి వీలుకాని రీతిలో మృతదేహం పడిఉండడం.. చూస్తే చిరుతా..లేక ఎలుగుబంటా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. మరికొందరు రేసుకుక్కల పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఒక నిర్ణయానికి రాగలమని అధికారులు చెబుతున్నారు. అయితే చిరుతదాడేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఘటన స్థలాన్ని సీసీఎఫ్‌ నాగేశ్వరరావు, డీఎఫ్‌ఓ సతీష్‌కుమార్‌ పరిశీలించారు. దాడిచేసిన జంతువును బంధించేందుకు బేస్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలుగుబంటు అయితే మత్తుద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్‌ ద్వారా బంధించనున్నట్లు వెల్లడించారు. జంతువుల కదిలికలను గుర్తించేందుకు ట్రాప్‌ కెమెరాలతో పాటు డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్‌ జోన్‌గా ప్రకటించారు. ఘటనా స్థలాన్ని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి పరిశీలించారు. చిన్నారి మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
సంఘటనా స్థలాన్ని ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. బాలికను వన్యమృగాలు దారుణంగా చంపడం బాధాకరమన్నారు. భక్తులందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.

Advertisement

What’s your opinion

Advertisement