వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Published Thu, Oct 12 2023 4:38 AM

 పవిత్రాల ఊరేగింపు - Sakshi

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతిలోని ఎంజీఎం నగరపాలక ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా మునిశారద, గౌరవాధ్యక్షుడిగా బి.గంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి.యల్లప్పరెడ్డి, కోశాధికారిగా ఎస్‌.బాబులాల్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం.గణేష్‌బాబు, రాష్ట్ర కౌన్సిలర్లుగా బి.గణేష్‌, బి.వెంకటరమణ, సీహెచ్‌ కృష్ణ, మహిళా కార్యదర్శులుగా ఈ.సునీత, కె.నాగలక్ష్మితో పాటు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ఆడిట్‌ కన్వీనర్లు, సాంకేతిక నిపుణులుగా మరో 15మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

పుత్తూరు రూరల్‌: అప్పలాయగుంటలో టీటీడీ అనుబంధ శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారు జామున శ్రీస్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు ఆధ్వర్యంలో యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్‌కు, ఉత్సవర్లకు, పద్మావతీ, ఆండాళ్‌ అమ్మవార్లకు, జయ విజయులకు, గరుడాళ్వార్‌కు, ఆంజనేయస్వామికి, ధ్వజస్తంభం, ఇతర పరివార దేవతలకు పవిత్ర సమర్పణ గావించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏఈఓ రమేష్‌, సూపరిండెంట్‌ శ్రీవాణి పర్యవేక్షించారు.

పవిత్రోత్సవాల్లో నేడు : మూడవ రోజు ఉదయం 9–30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.11–30 నుంచి 12–30 గంటల మధ్య మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన నిర్వహించనున్నట్లు ఏఈఓ రమేష్‌ తెలిపారు.

1/2

మునిశారద   యల్లప్పరెడ్డి
2/2

మునిశారద యల్లప్పరెడ్డి

Advertisement
Advertisement