అరణ్య రోదన! | Sakshi
Sakshi News home page

అరణ్య రోదన!

Published Fri, Nov 24 2023 1:12 AM

- - Sakshi

ఆక్రమిత భూమిలో

కర్రలే విద్యుత్‌ స్తంభాలు

చెరువులు, గుట్టలే కాదు.. ఏకంగా అడవినే ఆక్రమించేశారు. చెట్టూపుట్టా కొట్టి చదును చేశారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా నిమ్మ సాగుకు శ్రీకారం చుట్టారు. సాగునీటి కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే అటవీశాఖ భూముల్లో బోర్లు సైతం డ్రిల్‌ చేశారు. ఆపై మోటార్లు అమర్చి నిబంధనలకు విరుద్ధంగా కరెంట్‌ తీగలు లాగారు. వీటికి అనుమతులు లేకపోవడంతో కర్రలనే స్తంభాలుగా మార్చేశారు. అధికారుల కళ్లుగప్పి యథేచ్ఛగా సాగుచేస్తున్నారు.

ఈ ఘటన ఎక్కడో కాదండోయ్‌.. వెంకటగిరి మండలం, బసవాయిగుంట పరిధిలో..ఇక్కడ ఉన్న ప్రభుత్వ, అటవీ భూములను తమ్ముళ్లు కబ్జా చేసి సాగు చేస్తుండడం గమనార్హం.

సాక్షి, తిరుపతి: నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. గూడూరు డివిజన్‌ పరిధిలో ప్రభుత్వ, అటవీ, కాలువ, చెరువు పోరంబోకు భూములను విచ్చలవిడిగా ఆక్రమించుకున్నారు. అలా ఆక్రమించుకున్న భూములను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు నేడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటగిరి మండలం, బసవాయిగుంట పరిధిలో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణలకు దిగారు. సర్వే నం.74లో వందల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. నాటి ఎమ్మెల్యే, నేటి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు, తన సామాజికవర్గం వారు ఏకమై 175 ఎకరాలు ఆక్రమించారు. అందులో నిమ్మసాగుకు శ్రీకారం చుట్టారు. ఆక్రమణల విషయం అటవీ అధికారులకు తెలియడంతో స్వాధీనానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడడం, అటవీ అధికారులపైనే కేసులు పెట్టడం అక్కడ అప్పట్లో చర్చనీయాంశమైంది. అయినా 100 ఎకరాల వరకు స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్‌ చేపట్టారు. మిగిలిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ టీడీపీ నేతలు అటవీ అధికారులపై ఎదురు కేసులు పెట్టి ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. నిబంధనలకు విరుద్ధంగా అటవీ యాక్ట్‌ను తుంగలో తొక్కి జేసీబీలతో చదునుచేసి భూములను ఆక్రమించుకున్నారు. అందులో నిమ్మసాగు ప్రారంభించారు. సాగు కోసం బోర్లు వేసి అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చుకున్నారు. అదికూడా కర్రలు నాటి విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు.

భూమి స్వభావాన్నే మార్చేశారు

చట్ట ప్రకారం అటవీ భూములను ఆక్రమించి, సాగు చేయకూడదు. అందులో బోర్లు, విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేయకూడదు. ఒక వేళ తెలిసో తెలియకో ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్నా.. ఆ భూమి రెగ్యులరైజ్‌ కాదు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు కింది స్థాయి రెవెన్యూ అధికారులు, ఆపరేటర్ల సహకారంతో అటవీ భూములను ప్రభుత్వ, మేత పోరంబోకు భూమిగా ఆన్‌లైన్‌లో మార్పులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాచేస్తే రేపు భూములు రెగ్యులరైజ్‌ చేసేందుకు అవకాశం దొరుకుతుంది. రెవెన్యూ అడంగల్‌ రికార్డు ప్రకారం అటవీ భూమి అని ఉంది. రీసర్వే తరువాత ఎఫ్‌ఎల్‌ఆర్‌ ప్రకారం పశువుల మేత పోరంబోకు భూమి అని ఉంది.

బసవాయిగుంటలో.. తమ్ముళ్ల పాగా!

నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని

175 ఎకరాల ఆక్రమణ

అటవీ అధికారుల చొరవతో 100

ఎకరాలు స్వాధీనం

మరో 75 ఎకరాల స్వాధీనానికి యత్నం

అటవీ భూమి ఆన్‌లైన్‌లో

ప్రభుత్వ భూమిగా మార్పు

కి.మీ పైగా అక్రమంగా విద్యుత్‌ లైన్‌ ఆపై విద్యుత్‌ చౌర్యం

చర్యలు తప్పవు

ఎఫ్‌ఎల్‌ఆర్‌ ప్రకారం ఆ భూమి పశువుల మేత పోరంబోకు భూమి అని ఉంది. భూమి వివరణ విషయంలోకి వస్తే అటవీ భూమి. అయితే ఆక్రమణల విషయం మా దృష్టికి రాలేదు. ఆ భూమి ఆక్రమించి ఉంటే విచారించి చర్యలు తీసుకుంటాము.

– పద్మావతి, తహసీల్దార్‌, వెంకటగిరి

అది అటవీ భూమే

ఆ సర్వే నంబర్‌లో ఉన్న విస్తీర్ణం మొత్తం అటవీ భూమే. ఆ భూమిని కొందరు ఆక్రమించుకున్న మాట వాస్తవమే. అందులో వంద ఎకరాల వరకు స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్‌ చేశాము. మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది

– రాజేంద్రప్రసాద్‌, ఫారెస్ట్‌ రేంజర్‌, వెంకటగిరి

ఆక్రమిత భూమిలో సాగులో ఉన్న నిమ్మతోట
1/1

ఆక్రమిత భూమిలో సాగులో ఉన్న నిమ్మతోట

Advertisement

తప్పక చదవండి

Advertisement