ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Sat, Nov 25 2023 12:52 AM

కలశాలకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు  - Sakshi

తిరుపతి అర్బన్‌/రేణిగుంట : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నా రు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో గవర్నర్‌, ముఖ్యమంత్రి పాల్గొంటున్నందున చిన్నపాటి తప్పిదానికి కూడా తావు లేకుండా సర్వం సిద్ధం చేయాలన్నారు. ఈ క్రమంలో రేణిగుంట విమానాశ్రయంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

వైభవంగా అక్కదేవతలకు కార్తీక పూజ

తిరుమల : తిరుమల మొదటి కనుమ రహదారిలోని అక్కదేవతల ఆలయంలో శుక్రవారం ఉదయం టీటీడీ రవాణా విభాగం వారు కార్తీకమాస పూజను వైభవంగా నిర్వహించారు. అక్కదేవతలకు ఏటా కార్తీకమాసంలో ప్రత్యేక పూజ జరిపించడం ఆనవాయితీ. ఈ క్రమంలో టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. కనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు.

వైభవం..

అష్టోత్తర శత కలశాభిషేకం

రాపూరు : పెంచలకోనలోని శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం చిలుక ద్వాదశిని పురస్కరించుకుని నృసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవేరులకు వైభవంగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. నిత్య కైంకర్యాలు సమర్పించిన అనంతరం దేవదేవేరుల ఉత్సవర్లను తిరుచ్చిలో ఊరేగింపుగా శ్రీవారి నందనవనంలోకి వేంచేపు చేసి హోమం జరిపించారు. ఈ క్రమంలో పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చందనం, పసుపు, కుంకుమ, కొబ్బరినీరు, తులసి, వివిధ పళ్లరసాలతో స్నపన తిరుమంజనం, 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం నందనవనంలోని ఉసిరి, తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు, సాయంత్రం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన స్వర్ణ గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తం

తిరుపతి క్రైమ్‌ : సైబర్‌ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో లాటరీ, లక్కీ డ్రా ద్వారా బహుమతుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు తెలియజేయకూడదన్నారు. ఈ–మెయిల్‌, వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయకూడదన్నారు. వెబ్‌సైట్‌లో అక్షర దోషాలు, రంగులు, వింత లోగోలు ఉంటే అవి ఫేక్‌ వెబ్‌సైట్‌లుగా గుర్తించాలని వివరించారు. ఫేక్‌ యాప్‌ల్లో లోన్లు తీసుకోకూడదని స్పష్టం చేశారు. సైబర్‌ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఆర్టీసీలో ‘గుర్తింపు’ సంబరం

తిరుపతి అర్బన్‌ : ఆర్టీసీ వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌కు ప్రభుత్వ గుర్తింపు లభించడంతో శుక్రవారం తిరుపతి సెంట్రల్‌ బస్టాండ్‌ వద్ద సంఘం నేతలు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అసోసియేషన్‌ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు లతా రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.తులసీరామ్‌రెడ్డి, జోనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.పరంధామయ్య, జిల్లా చైర్మన్‌ ఎన్‌.అల్లయ్య, అధ్యక్షుడు జీవీ ముని తదితరులు పాల్గొన్నారు.

విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు
1/2

విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

హర్షం వ్యక్తం చేస్తున్న నేతలు
2/2

హర్షం వ్యక్తం చేస్తున్న నేతలు

Advertisement
Advertisement