● తుపాను ప్రభావంతో భారీ వర్షాలు ● తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు ● ఉప్పొంగుతున్న చెరువులు, నదులు ● రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేస్తున్న అధికారులు ● నేడు విద్యాసంస్థలకు సెలవు ● జిల్లా వ్యాప్తంగా కంట్రోల్‌ రూమ్‌లు, హెల్ప్‌డెస్క్‌లు | Sakshi
Sakshi News home page

● తుపాను ప్రభావంతో భారీ వర్షాలు ● తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు ● ఉప్పొంగుతున్న చెరువులు, నదులు ● రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేస్తున్న అధికారులు ● నేడు విద్యాసంస్థలకు సెలవు ● జిల్లా వ్యాప్తంగా కంట్రోల్‌ రూమ్‌లు, హెల్ప్‌డెస్క్‌లు

Published Mon, Dec 4 2023 2:02 AM

- - Sakshi

తిరుపతి అర్బన్‌/కేవీబీపురం/సూళ్లూరుపేట/ నాయుడుపేట టౌన్‌/నారాయణవనం/వాకాడు/పిచ్చాటూరు/రేణిగుంట/తిరుపతి సిటీ : మిచాంగ్‌ తుపాను మంగళవారం తీరం దాటే అవకాశముండడంతో జిల్లావ్యాప్తంగా పెను గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు పొంగి పొర్లుతున్నాయి.ఆదివారం శ్రీకాళహస్తిలో అత్యధికంగా 155.3మి.మీ, అత్యల్పంగా సత్యవేడులో 2.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

అధికారులు అప్రమత్తం

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. చంద్రగిరి నియోజవర్గం తిరుపతి రూరల్‌ పరిఽధిలోని యోగిమల్లవరం, తనపల్లి, కుంట్రపాకం ప్రాంతాలలో స్వర్ణముఖి నదీ ప్రవాహన్ని తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఆర్డీఓ నిషాంత్‌రెడ్డి పరిశీలించారు. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని తోపుగుంటపాళెం వద్ద ఉప్పొంగుతున్న ఉప్పుటేరును జేసీ బాలాజీ పరిశీలించారు. కోట మండలం తీరప్రాంతంలోని కొత్త పట్నం వాసులను అప్రమత్తం చేశారు. వాకాడు మండలం తూపిలిపాళెంలో మత్స్యకారులను వేటకు వెళ్లరాదంటూ ఆదేశించారు. పునరావస కేంద్రాల్లోని వారికి ఆహారం, తాగునీరు, నిత్యావసర సరుకులు అందించారు. తీర ప్రాంత గ్రామాల్లో రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కోతకు గురైన పాళెంకోట వంతెనను పరిశీలించారు. పిచ్చాటూరు– శ్రీకాళహస్తి మార్గంలో కోవనూరు వద్ద రాళ్లవాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పిచ్చాటూరు మండలంలో గొడ్డేటి వాగు వద్ద గట్టి బందోబస్తు పెట్టారు. నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదీ ప్రవాహాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు పరిశీలించారు. మామిడి కాలువ పొంగిపొర్లుతుండడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల

కేవీబీపురం మండలంలోని కాళంగి రిజర్వాయర్‌ దాదాపు నిండిపోయింది 6,120 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఆరు మినీ గేట్లు, రెండు ప్రధాన గేట్ల నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పిచ్చాటూరు మండలంలోని అరణియార్‌ ప్రాజెక్టులో నీటి మట్టం 26 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం గంటకు 2 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోందని, సోమవారం ఉదయం 9.30 గంటలకు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు ఇరిగేషన్‌ ఈఈ మదనగోపాల్‌ వెల్లడించారు. రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌ శనివారం రాత్రి నిండిపోవడంతో ఆదివారం 11 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. కల్యాణి డ్యామ్‌ ఆదివారం రాత్రికి పూర్తి స్థాయిలో నిండుతుందని అంచనా వేస్తున్నారు. వాకాడు వైఎస్సార్‌ స్వర్ణముఖి బ్యారేజ్‌ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు.

ఉధృతంగా జలపాతాలు

నారాయణవనం మండలంలోని కై లాసనాథకోన, సింగిరి కోనలోని జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరణ్యకండ్రిగ పంచాయతీలోని తుంబూరు తీర్థ కోన జలపాతం కనువిందు చేస్తోంది.

తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

నిండిన పులికాట్‌ సరస్సు

భారీ వర్షాలకు పులికాట్‌ సరస్సుకు వరద పోటెత్తుతోంది. నదులతోపాటు సముద్ర ముఖద్వారం నుంచి భారీగా నీరు చేరడంతో నిండుగా మారింది.

విద్యుత్‌శాఖ కంట్రోల్‌ కేంద్రం

నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి సబ్‌ డివిజన్‌ పరిధి విద్యుత్‌ సమస్యలు తలెత్తితే 73826 23178 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీడీసీఎల్‌ ఈఈ ప్రసన్నకుమార్‌ కోరారు.

ఉసురు తీసిన ముసురు

ఏర్పేడు: మండలంలోని చిందేపల్లి ఎస్టీ కాలనీలో ఆదివారం పూరి గుడిసె కూలడంతో ఓ బాలుడు మృతి చెందాడు. వివరాలు.. శ్రీను, కావేరి దంపతులకు ముగ్గురు పిల్లలు. భారీ వర్షాలు కురుస్తుండడంతో వీఆర్‌ఓ రమణ గ్రామానికి వెళ్లి స్థానికులను పంచాయతీ కార్యాలయంలో తలదాచుకోవాలని సూచించారు. కాలనీ వాసులు స్పందించ లేదు. ఈ క్రమంలో శ్రీను కుటుంబం నివసిస్తున్న గుడిసె వర్షం తాకిడికి కూలింది. వారి రెండో కుమారుడు యశ్వంత్‌ (4)పై మట్టి గోడ పడి మృత్యువాత పడ్డాడు. వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి గున్నేరి కిషోర్‌రెడ్డి వెంటనే గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు.

ఏర్పేడు మండలం పాతవీరాపురంలో నీట మునిగిన పంట పొలాలు
1/10

ఏర్పేడు మండలం పాతవీరాపురంలో నీట మునిగిన పంట పొలాలు

అంజిమేడు వద్ద బండమానివాగు నీటి ప్రవాహం
2/10

అంజిమేడు వద్ద బండమానివాగు నీటి ప్రవాహం

గొడ్డేటి వాగు వద్ద పోలీసు కాపలా
3/10

గొడ్డేటి వాగు వద్ద పోలీసు కాపలా

ఉధృతంగా ప్రవహిస్తున్న కైవల్యానది
4/10

ఉధృతంగా ప్రవహిస్తున్న కైవల్యానది

కాళంగి రిజర్వాయర్‌ నుంచి బయటకు వదిలిన నీరు
5/10

కాళంగి రిజర్వాయర్‌ నుంచి బయటకు వదిలిన నీరు

మల్లెమడుగు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల
6/10

మల్లెమడుగు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల

కాళంగి వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు
7/10

కాళంగి వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు

పులికాట్‌కు జలకళ
8/10

పులికాట్‌కు జలకళ

తీరప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు
9/10

తీరప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు

యశ్వంత్‌ మృతదేహం
10/10

యశ్వంత్‌ మృతదేహం

Advertisement
Advertisement