స్వర్ణమ్మ పరవళ్లు | Sakshi
Sakshi News home page

స్వర్ణమ్మ పరవళ్లు

Published Mon, Dec 4 2023 2:02 AM

-

హారతికి సిద్ధంగా ఉత్తర వాహిని

ఐదేళ్ల నుంచి ఏటా నదిలో

నీటి ప్రవాహం

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉత్తరవాహినిగా ప్రసిద్ధి చెందిన స్వర్ణముఖీ నది గత ఐదేళ్లలో క్రమం తప్పకుండా ఏటా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. తిరుపతి రూరల్‌ మండలం తొండవాడలో పుట్టి కొండల నడుమ ముందుకు సాగే ఈ పవిత్ర నదిలో పుణ్యస్నానమాచరించేందుకు భక్తులు తరలివస్తుంటారు. శ్రీనివాసమంగాపురం, అగస్తీశ్వరాలయం, యోగిమల్లవరంలోని పరశురామేశ్వరాలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వరుని ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, ఈశ్వరాపురం అర్ధనారీశ్వరాలయాలను స్పృశిస్తూ నాయుడుపేట, కోట మీదుగా స్వర్ణముఖి సముద్రంలో కలుస్తోంది. ఒకప్పుడు ఈ నదిలో నీటి ప్రవాహం కాకుండా మురుగు నీరు నిల్వ చేరి ఉండేది. గతంలో శ్రీకృష్ణదేవరాయులవారు ముక్కంటిని సేవించుకుని స్వర్ణముఖి నదికి హారతి సమర్పించారని చరిత్రలో పేర్కొని ఉంది. పురాతన సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదేళ్లుగా స్వర్ణముఖీనదికి వైభవోపేతంగా హారతి సమర్పిస్తున్నారు. అప్పటి నుంచి హారతి అందుకునేందుకు ఏటా కార్తీక మాసంలో స్వర్ణమ్మ పరవళ్లు తొక్కడం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ పూర్తయినా నదిలో నీరు లేకపోవడంతో కొందరు అవహేళనగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో భారీ వర్షాలకు స్వర్ణముఖి ఉప్పొంగుతుండడంతో పట్టణప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన కనులపండువగా నదీమతల్లికి హారతి సమర్పించేందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement