Sakshi News home page

సర్వీస్‌లో బెంచ్‌ మార్క్‌ సాధించాలి

Published Mon, Dec 25 2023 1:18 AM

- - Sakshi

తిరుపతి అర్బన్‌: ఏ అధికారి అయినా తమ సర్వీసులో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టినప్పుడు, ఆ పనులు ఓ బెంచ్‌ మార్క్‌గా జీవితంలో నిలిచిపోతాయని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తూ ఇటీవల ఆరోగ్యశ్రీ సీఈవోగా బదిలీపై వెళ్లిన డీకే బాలాజీని కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా సన్మానించారు. జేసీ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి అధికారులందరూ హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్త ఏర్పాటైన తిరుపతి జిల్లాలో డీకే బాలాజి జేసీగా 20 నెలలు పనిచేశారని చెప్పారు. ఆయన ప్రధానంగా భూముల రీ సర్వే, సివిల్‌ సప్లై, నేషనల్‌ హైవేస్‌, దీర్ఘకాలిక భూముల రిజిస్ట్రేషన్లు(22ఏ జాబితాలోని) తదితర సమస్యలకు సరైన పరిష్కారం చూపడంలో డీకే బాలాజీ కృషి అభినందనీయమని చెప్పారు. డీకే బాలాజీ మాట్లాడుతూ కొత్త జిల్లాతోపాటు తిరుపతి పుణ్యక్షేత్రంలో పనిచేసే అవకాశం లభించడం ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పారు. డీఆర్వో పెంచల కిషోర్‌ మాట్లాడుతూ జాయింట్‌ కలెక్టర్‌ డీకే బాలాజీ రెవెన్యూ, రీసర్వే తదితర ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేసి పురోగతి సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పలువురు జిల్లా అధికారులు జేసీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతోపాటు డివిజన్‌ స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో ఈ ఏడాది జూలైలో నిర్వహించిన డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలు ఆదివారం ఆన్‌లైన్‌లో విడదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతోపాటు అన్ని యూజీ కోర్సులకు సంబంధించి 4వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా ఫలితాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

ఈఎస్‌ఐ ఆస్పత్రి తనిఖీ

తిరుపతి తుడా: నగరంలోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆస్పత్రిని ఆదివారం కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్తి అహుజ తనిఖీ చేశారు. ఆమెకు ఆస్పత్రి డాక్టర్లు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగం, ఆపరేషన్‌ థియేటర్లు, మహిళా, పురుషుల ఇన్‌పేషంట్‌ వార్డులను, ఓపీ విభాగం, ల్యాబ్‌, ఫిజియో థెరపీ, స్టోర్స్‌ను తనిఖీ చేసి పేషంట్ల రికార్డులను పరిశీలించారు. అనంతరం వార్డులో చికిత్స పొందుతున్న రోగుల నుంచి వైద్య సేవల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారా అంటూ ఆరా తీశారు. 2021లో గడువు ముగిసిన సర్జికల్‌, ల్యాబ్‌, డ్రెస్సింగ్స్‌ వంటి ఈఎస్‌ఐ సీ రేట్‌ కాంట్రాక్టు బుక్స్‌ పునరుద్ధరణ చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, ఏపీ, తమిళనాడు ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ రాష్ట్ర రీజినల్‌ డైరెక్టర్లు వేణుగోపాల్‌, కిరణ్‌ కుమార్‌, తిరుపతి ప్రాంతీయ కార్యాలయ అధికారులు రాధాకృష్ణ, రజనీకాంత్‌ పాల్గొన్నారు.

నిత్య వ్యాయామంతో ఆరోగ్యం

తిరుపతి కల్చరల్‌: ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ గంటపాటు నడక, నిత్య వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం నుంచి మహతి కళాక్షేత్రం వరకు వాక్‌ థాన్‌–2023 నిర్వహించారు. దీన్ని ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వ్యాయామాన్ని నిత్య అలవాటుగా మార్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమన్నారు. అనంతరం ఆటా ప్రతినిధి మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్మన్‌ జయంత్‌ చట్టా తాము చేపడుతున్న సమాజ సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆటా ప్రతినిధులు సతీష్‌రెడ్డి, పరమేష్‌ భీమ్‌రెడ్డి, కాశీ కొత్త, ఈశ్వర్‌ బండా, అనిల్‌ కుమార్‌, ఎస్వీయూ రుషా విభాగం అధికారి వంశీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement