Sakshi News home page

సమస్యలతో బెరుకు

Published Tue, Mar 28 2023 6:08 AM

వికారాబాద్‌ పట్టణంలోని 
ప్రధాన రహదారిపై వాహనదారుల అవస్థలు - Sakshi

రోడ్లు ఇరుకు..

వికారాబాద్‌ అర్బన్‌: వికారాబాద్‌ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పదిహేను ఏళ్ల క్రితం పట్టణం ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందంటున్నారు పట్టణ ప్రజలు. 2009లోనే వికారాబాద్‌ పట్టణం శాటిలైట్‌ టౌన్‌గా ఎంపికైంది. దీంతో పట్టణ రూపురేఖలు మారుతాయనుకున్నారు. శాటిలైట్‌ కింద ఒక అండర్‌ డ్రైనేజీ పనులు మినహా ఏ పనికాలేదు. శాటిలైట్‌ డేటాతో రెండో సారి ప్లాన్‌ తయారు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం రావడం లేదు. దీంతో అధికారులు పాత ప్లాన్లనే అమలు చేస్తున్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో రహదారుల విస్తరణ, ప్రధాన రోడ్లలో ట్రాఫిక్‌, పార్కింగ్‌, ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, జోన్‌ల ఏర్పాటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

రింగు రోడ్డు కలేనా?

వికారాబాద్‌ పట్టణానికి రింగ్‌ రోడ్డు అవసరమనే విషయాన్ని రెండు దశాబ్దాల క్రితమే అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ నాయకులు రింగ్‌ రోడ్డుపై హామీలు గుప్పిస్తున్నారు. కానీ నేటికీ ఆ కల నెరవేరడం లేదు. ఏడాదికి ఒకసారి రింగు రోడ్డు సర్వే అయ్యిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చారని, మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా రింగ్‌ రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతుందని నాయకులు ప్రచారం చేసుకోవడమే తప్ప కార్యరూపం దాల్చడంలేదు. బీఆర్‌ఎస్‌ మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో వికారాబాద్‌కు రింగ్‌ రోడ్డు మంజూరు అయ్యిందని, ఆ మంజూరు అప్పటి మంత్రి మహేందర్‌ రెడ్డి తాండూరుకు తరలించారనే ప్రచారం జరిగింది. ఏదిఏమైనా దశాబ్దాలు గడుస్తున్నా జిల్లా కేంద్రం ప్రజలు రింగురోడ్డు నిర్మాణం కోసం ఎదురుచూడక తప్పడం లేదు.

రోడ్లన్నీ అధ్వానం

జిల్లా కేంద్రంలో ఏ రోడ్డు చూసినా అధ్వానంగా కనిపిస్తోంది. ఆలంపల్లి ప్రధాన రోడ్డు, ఎన్టీఆర్‌ క్రాస్‌ రోడ్డు, బస్టాండ్‌ రోడ్డు, రామయ్య గూడ రోడ్డు, మహాశక్తి చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్‌ రోడ్లు పూర్తి ఇరుకుగా ఉన్నాయి. రోడ్డు వెడల్పునకు అధికారులు అడుగులు వేసినా.. వ్యాపారులు పోటాపోటీగా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. బీజేఆర్‌, మహాశక్తి చౌరస్తాల్లో కనీసం ఆర్టీసీ బస్సులు తిరగడానికి అవకాశం లేకుండా పోతోంది. ప్రధాన రోడ్లకు ఇరువైపులా పండ్ల వ్యాపారులు తోపుడు బండ్లను పెట్టడంతో వాహనాల రాకపోకలకు మరింత ఇబ్బంది ఏర్పడుతోంది. రోడ్ల సమస్యను తీర్చేందుకు అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రైల్వే బ్రిడ్జి కుంగితే..

వికారాబాద్‌ పట్టణం చుట్టూ రైల్వే ట్రాక్‌ ఉంది. పట్టణంలోకి రావాలన్నా బయటకు వెళ్లాలన్నా రైల్వే బ్రిడ్జి మీదుగానే. ఈ బ్రిడ్జి మూడు దశాబ్దాల క్రితం నిర్మించింది కావడంతో ఇటీవల రెండు మూడు చోట్ల మట్టి కుంగిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఏ కారణం చేతనైనా బ్రిడ్జి మరమ్మ తుకు నోచుకున్నా.. కుంగినా పట్టణంలోకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ విషయం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తెలిసినా ప్రత్యామ్నాయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఆమోదం పొందని మాస్టర్‌ ప్లాన్‌..

పట్టణం అభివృద్ధికి గతంలోనే మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 2014లో ఒక సారి, 2019లో మరోమారు మాస్టర్‌ ప్లాన్‌ వేయించారు. సుమారు పది మంది ప్రత్యేక సిబ్బంది వచ్చి పది రోజుల పాటు ఇక్కడే ఉండి పెరుగుతున్న జనా భా అవసరాల దృష్ట్యా శాటిలైట్‌ మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేసి డీటీసీపీ కార్యాలయంలో సమర్పించారు. ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. మాస్ట ర్‌ ప్లాన్‌ అమలు కాకపోవడం ఓ రకంగా పట్టణ అభివృద్ధికి ఆటంకంగా మారిందని చెప్పవచ్చు.

జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ పట్టణంలో అడ్డగోలుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రహదారులను సైతం ఆక్రమించి నిర్మిస్తున్నారు. ఫలితంగా దారులన్నీ ఇరుకుగా మారుతున్నాయి. ‘మాస్టర్‌ ప్లాన్‌’ అమలు చేయాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఎక్కడపడితే అక్కడ భవంతులు వెలుస్తున్నాయి. సుమారు 80 వేలు జనాభా ఉన్న పట్టణంలో మౌలిక వసతులు, రోడ్లు, సుందరీకరణ వంటి పనులు సైతం కానరావడంలేదు. శాటిలైట్‌ టౌన్‌గా ఎంపికై నా నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

ఇష్టారాజ్యంగా వెంచర్లు..

ప్లాన్‌ లేని కారణంగా మున్సిపల్‌ పరిధిలో రియల్‌ వ్యాపారులు ఇష్టానుసారంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో నివాస గృహాలు, పరిశ్రమలు, కార్యాలయాలు, వ్యాపార సముదాయల ప్రాంతాలను జోన్లుగా గుర్తిస్తారు. బఫర్‌ జోన్స్‌, రిక్రియేషన్‌ సెంటర్‌, బైపాస్‌ రోడ్లు నిర్మిస్తారు. ప్లాన్‌ అమలైతే ఏ వెంచర్ల నుంచి రింగ్‌ రోడ్డు, సబ్‌ రోడ్లు వెళ్తాయో తెలియదు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులు నష్ట పోయే అవకాశం ఉంది.

వికారాబాద్‌లో మాస్టర్‌ ప్లాన్‌ ఏమాయె?

జిల్లా కేంద్రంగా మారినా కానరాని మౌలిక వసతులు

పట్టణంలో ఇష్టానుసారంగా నిర్మాణాలు

రహదారులపైనే చిరువ్యాపారాలు

కలగా మారిన శాటిలైట్‌ టౌన్‌

హామీలకే పరిమితమైన నాయకులు

దృష్టిసారించని పాలకులు

అమలుకు సిద్ధంగా ఉన్నాం

మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నతాధికారుల వద్ద రెడీగా ఉంది. అమలు చేయాలని ఆదేశాలు వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్త వెంచర్లకు, కొత్త నిర్మాణాలకు భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకొనే అనుమతులు ఇస్తున్నాం.

– శరత్‌ చంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌, వికారాబాద్‌

Advertisement
Advertisement