విచ్ఛలవిడిగా ఇసుక దందా | Sakshi
Sakshi News home page

విచ్ఛలవిడిగా ఇసుక దందా

Published Thu, May 4 2023 4:34 AM

- - Sakshi

పెద్దేముల్‌: మండలంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరందుకుంది. అధికారుల సహకారం, రాజకీయ పలుకుబడితో యథేచ్ఛగా సాగుతోంది. సాయంత్రం ఆరు గంటలకే ఇసుక ట్రాక్టర్లు రోడ్లెక్కుతున్నాయి. ఈ విషయం రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఇసుక దళారులు ట్రాక్టర్‌కు కొంత డబ్బు చెల్లించి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇసుక అక్రమ దందాపై అధికారులు ఏసీబీకి చిక్కినా అడ్డుకట్ట పడడం లేదు. మండలంలోని మన్‌సాన్‌పల్లి, కొండాపూర్‌, రుక్మాపూర్‌, యాలాల మండల బిజ్వారం వాగుల నుంచి ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామంలో మట్టి అక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. ఇసుక వ్యాపారులు ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ. 2వేల నుంచి రూ.3వేలు వరకు అధికారులకు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ పనులకు ఇసుక అనుమతులు ఇవ్వాలని సర్పంచులు మండల సర్వసభ్య సమావేశాలలో మొర పెట్టుకున్నా పట్టించుకునే నాథులు లేరు. దీంతో వారు వంద శాతం రోబో శ్యాండ్‌ వేసి రోడ్లు, మురుగు కాలువల పనులు చేస్తున్నారు.

ఆరు గంటలకే రోడ్లపైకి

ఇసుక అక్రమ వ్యాపారం చేసే వారు పగలంతా ట్రాక్టర్లకు నింపడం, స్టాక్‌ చేయడం, సాయంత్రం ఆరు గంటలు అయ్యాక రోడ్లపై వాలుతున్నారు. బహిరంగంగా మండల కార్యాలయం ముందు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. మన్‌సాన్‌పల్లి వాగు నుంచి ధారూర్‌తో పాటు పెద్దేముల్‌ మండలంలోని మారేపల్లి తండా మీదుగా కోటపల్లి, బంట్వారం మండలాలకు తరలిస్తున్నారు. అందుబాటులో ఉన్న గ్రామాలకు రూ. 4వేల నుంచి రూ.5వేలకు ట్రాక్టర్‌ ఇసుకను విక్రయిస్తున్నారు. దూరం ప్రాంతాలకు మరో ధరను నిర్ణయించి తరలిస్తున్నారు. ఏడాదిలో 9 నెలలు ఇసుక వ్యాపారం సాగుతుంది.

ఇసుక అడ్డా.. మంబాపూర్‌

ఇసుక అక్రమ వ్యాపారానికి మంబాపూర్‌ అడ్డాగా మారింది. మన్‌సాన్‌పల్లి, బిజ్వారం, రెగోండి గ్రామాల నుంచి వచ్చే ఇసుక ట్రాక్టర్లు మంబాపూర్‌ మీదుగా కుంచారం, బండమిదిపల్లి, తొరమామిడి, కోటపల్లి, బార్వాద్‌ తోపాటు పలు గ్రామాలకు వెళుతాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు దందా సాగిస్తారు. అంతేకాకుండా కాగ్నా పరీవాహక ప్రాంతంగా ఉన్న మదనంతాపూర్‌, రెగోండి, రుక్మాపూర్‌, ఖాంజాపూర్‌, కందనెల్లి ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వాగుల సమీపంలోని పొలాల్లో కులీలకు వ్యాపారులు స్థావరాలు ఏర్పాటు చేసి దందా సాగిస్తున్నారు.

తనిఖీలు శూన్యం

ఇసుక, ఎర్ర మట్టి, సుద్ద అక్రమ రవాణాను అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయం ముందు నుంచే అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. సీజ్‌ చేసిన ట్రాక్టర్లకు నామమాత్రంగా జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు.

ఇసుక అక్రమ రవాణా

బిజ్వార్‌, మన్‌సాన్‌పల్లి

వాగుల నుంచి తరలింపు

సాయంత్రం 6గంటలకే రోడ్లెక్కుతున్న ఇసుక ట్రాక్టర్లు

తెలిసినా పట్టించుకోని అధికారులు

నిఘా పెంచుతాం

మండలంలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులకు దళారులు డబ్బులు ఇస్తున్నారన్న మాట అవాస్తవం. వారం వారం తనిఖీలు చేస్తున్నాం. ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసి జరిమానాలు విధిస్తున్నాం. మన్‌సాన్‌పల్లి, రక్మాపూర్‌ ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం ఉంది. నిఘా పెంచుతాం.

– అన్వేష్‌రెడ్డి, ఎస్‌ఐ, పెద్దేముల్‌

1/1

Advertisement
Advertisement