ధాన్యం సేకరణ ప్రారంభం కావాలి | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ ప్రారంభం కావాలి

Published Tue, May 9 2023 7:48 AM

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి - Sakshi

కలెక్టర్‌ నారాయణరెడ్డి

వికారాబాద్‌ అర్బన్‌: రైతు స్థానంలో ఉండి, వారి సాధక బాధకాలు అర్థం చేసుకొని పని చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం వరి ధాన్యం సేకరణ, మన ఊరు – మన బడి తోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన 127 కేంద్రాల్లో రెండు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడం తోపాటు కూలీల సంఖ్యను పెంచాలన్నారు. అభివృద్ధి పనులను ఎంపీడీవోలు, డీఈలు, ఈఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూసకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని సర్పంచులతో మాట్లాడి పారిశుధ్య పనులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ పనులన్నీ ఈ నెలలోనే పూర్తి చేయాలన్నారు. వర్షం పడే విషయాన్ని ముందుగా తెలుసుకునేందుకు రెయిన్‌ అలారం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ యాప్‌ ద్వారా వారం రోజుల ముందుగానే వర్ష సూచనను రైతులకు తెలియజేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజావాణికి 226 ఫిర్యాదులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 226 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు.

విద్యార్థుల ఎంపిక

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన విద్యార్థులను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా నుంచి 43 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా డ్రా పద్ధతిలో ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, డీపీఆర్‌ఓ అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement