పూడూరులో పిల్లర్‌ స్థాయి దాటని ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం.. | Sakshi
Sakshi News home page

పూడూరులో పిల్లర్‌ స్థాయి దాటని ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం..

Published Thu, Jun 29 2023 5:26 AM

పూడూరులో పిల్లర్లకే పరిమితమైన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం - Sakshi

పూడూరు: మండల కేంద్రంలో పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టర్‌ నిర్వాకం వల్ల పనులు ముందకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. పూడూరు మండలానికి 50 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. పూడూరు, మన్నేగుడ, మీర్జాపూర్‌ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. పూడూరులోని శ్మశానవాటిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు.

రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పిల్లర్లకే పనులు పరిమితమయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 3,873 డబుల్‌ ఇళ్లు మంజూరయ్యాయి. సగానికిపైగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించగా, మరి కొన్ని ఇరిగేషన్‌ శాఖ, మున్సిపాలిటీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా పూడూరులో 50 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదుల పనులు పూర్తయి పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. పరిగి నియోజకవర్గానికి 680 ఇళ్లు మంజూరు కాగా పరిగి, దోమ, కులకచర్ల, గండ్వీడ్‌, మహమ్మదాబాద్‌ మండలాల్లో డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. నిధులు లేని కారణంగానే కాంట్రాక్టర్‌ పనులు ఆపేసినట్లు తెలిసింది.

పనులు వేగవంతం చేస్తాం
పూడూరులో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్‌ పనులు ఆపేశాడు. ప్రస్తుతం బిల్లులు వచ్చాయి. పనుల వేగం పెంచి త్వరలో పూర్తయ్యేలా చూస్తాం.
– మహేశ్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ

Advertisement
Advertisement