గొర్రెల పంపిణీకి చుక్కెదురు | Sakshi
Sakshi News home page

గొర్రెల పంపిణీకి చుక్కెదురు

Published Sun, Aug 27 2023 4:14 AM

- - Sakshi

వికారాబాద్‌: యాదవులు, గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో మాంసాహార ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం 2017లో గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని రెండు విడతలుగా అమలు చేయాలని నిర్ణయించిన సర్కారు.. మొదటి విడతలో 50శాతం, రెండో విడతలో 50శాతం యూనిట్లు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించింది. సొసైటీలుగా ఏర్పడి, సభ్యులుగా నమోదై 18 సంవత్సరాలు నిండిన గొల్ల కుర్మలకు ఒక యూనిట్‌ చొప్పున పంపిణీ ప్రారంభించింది. గొర్రెల కాపరులు తమ వాటాగా 25 శాతం డబ్బులు, ప్రభుత్వ వాటా 75శా తం నిధులు కలెక్టర్‌ ఖాతాలో జమచేసి జీవాలు కొనుగోలు చేసి గొల్ల కుర్మలకు అందజేస్తున్నారు.

‘అధికారులు చెప్పేది అబద్ధం’

రెండో విడత గొర్రెల పంపిణీ వ్యవహారం ఇవ్వాల్సింది కొండంత.. ఇచ్చింది గోరంత అన్న చందంగా తయారయింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని కుర్మలు సంతోషించేలోపే కొత్త అడ్డంకులు వస్తున్నాయి. జూన్‌ 9న గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉండగా కొనుగోలుకు జీవాలు దొరకక కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. గొర్రెల కొనుగోలుకు ఇటీవల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లిన అధికారుల బృందం ఉట్టి చేతులతో తిరిగి వచ్చారు. తిరిగి జూలైలో పంపిణీ ప్రారంభించగా.. 200 యూనిట్లకే పరిమితమయింది. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,477 యూనిట్ల పంపిణీ చేయగా.. రెండో విడతలో 11,583 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు 200 యూనిట్లు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. ప్రభుత్వం నిధులివ్వకపోవడంతోనే పంపిణీ నిలిచిందని.. గొర్రెలు దొరకడంలేదని అధికారులు చెబుతున్నదంతా వట్టిదేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఫ్రీజింగ్‌ నిధులతో పంపిణీ

బడ్జెట్‌ విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతూ వస్తున్నప్పటికీ రెండో విడత గొర్రెల పంపిణీ కోసం జిల్లాకు రావాల్సిన బడ్జెట్‌ విడుదల కాలేదు. మొదటి విడతలో కొందరికి చివరి నిమిషంలో పలుకారణాలతో పంపిణీ నిలిచి పోగా.. దానికి సంబంధించి రూ.2 కోట్ల నిధులు కలెక్టర్‌ ఖాతాలో ఫ్రీజింగ్‌లో ఉన్నాయి. వాటితో ప్రస్తుతం రెండో విడతపంపిణీ ప్రారంభించారు. మిగిలిన యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసేవరకు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో రెండో విడత పంపిణీ మూడడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కు అన్న చందంగా తయారయింది.

రెండో విడత పంపిణీ

లక్ష్యం 11,583 యూనిట్లు

జిల్లా వ్యాప్తంగా 311 గొర్రె కాపరుల సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 22,025 మంది సభ్యులున్నారు. 2017–18లో ప్రారంభించిన పథకంలో 2018 జూన్‌ చివరినాటికి 10,078 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో మిగిలిపోయిన యూనిట్లతో పాటు కొత్తగా ఏర్పడిన దుద్యాల, హకీంపేట్‌, చౌడాపూర్‌ మండలాల పరిధిలోని ఐదు గ్రామాలు కలిపి రెండో విడతలో మొత్తం 11,583 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. రెండో విడత గొర్రెల పంపిణీ పథకం కోసం జిల్లాకు మొత్తం రూ.202.27 కోట్ల బడ్జెట్‌ అవసరం. ఇందులో రూ.152.02కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుండగా రూ.50.67 కోట్లు తమ వాటాగా గొల్ల కుర్మలు చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీకి చుక్కెదురయింది. రెండో విడత పంపిణీకి జీవాలు దొరకడం లేదని చెబుతూ ప్రభుత్వం కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వేస్తోంది. నిధుల లేమితోనే పంపిణీ నిలిచిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వాయిదా పడుతున్న రెండో విడత

11,583 యూనిట్లకుగాను 200 మాత్రమే పంపిణీ

జీవాలు దొరకడం లేదని చెబుతున్న అధికారులు

నిధులు విడుదల చేయలేదనిప్రతిపక్షాల ఆరోపణ

ఆందోళనలో గొల్లకుర్మలు

Advertisement
Advertisement