కోస్గి డిపోలో బస్సులు కరువు | Sakshi
Sakshi News home page

కోస్గి డిపోలో బస్సులు కరువు

Published Mon, Sep 4 2023 6:02 AM

విస్తరణకు నోచుకోని కొడంగల్‌ బస్టాండ్‌  - Sakshi

కొడంగల్‌ : నియోజకవర్గ పరిధిలోని కోస్గి ఆర్టీసీ డిపోలో బస్సులు కరువయ్యాయి. కాలం చెల్లిన 11 బస్సులు డిపోలో ఉన్నాయి. వీటితోనే కొన్ని రూట్లలో పల్లె వెలుగు బస్సులు నడుపుతున్నారు. ఒక్క బస్సు మాత్రమే ఎక్స్‌ప్రెస్‌. ఇది హైదరాబాద్‌ కోస్గి రూట్‌లో నడుస్తోంది. ఈ బస్సులు ఎప్పుడు ఎక్కడా ఆగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. డిపో నిర్వహణపై ప్రయాణీకుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

జూన్‌ 4న డిపో ప్రారంభం

ఎన్నో ఏళ్ల జాప్యం తర్వాత రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా గత ఏడాది జూన్‌ 4వ తేదిన కోస్గిలో ఆర్టీసీ డిపోను ప్రారంభించారు. కేవలం పదకొండు బస్సులతో కోస్గి బస్సు డిపో నిర్వహణ కొనసాగుతోంది. దీంతో నియోజకవర్గ ప్రజలకు రవాణా సేవలు అందడం లేదు. కోస్గి బస్సు డిపో ప్రారంభమైతే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సులు తిరుగుతాయని ప్రజలు ఆశించారు. డిపో ప్రారంభించి ఏడాది దాటినా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందడం లేదనే ఆరోపణ ఉంది. పల్ల్లెకు బస్సులు రావడం లేదని విద్యార్థులు ఆటోలు, జీపుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 11 బస్సులతో రోజుకు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులు పెంచితే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులను వివరణ కోరగా త్వరలో కొత్త బస్సులు వస్తాయని తెలిపారు. అద్దె బస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కొత్త బస్సులు వచ్చిన తర్వాత రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ కోస్గి డిపోకు మేనేజర్‌ను నియమించలేదు. డిపోలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. బస్సులను శుభ్రం చేసే స్టాండ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో మెకానిక్‌లను నియమించలేదు. సిబ్బంది సైతం నామమాత్రంగానే ఉన్నారు.

విస్తరణకు నోచుకోని కొడంగల్‌ బస్టాండ్‌

తెలంగాణ – కర్నాటక రాష్ట్ర సరిహద్దులో రెండు జాతీయ రహదారులను కలిపే కొడంగల్‌ బస్టాండ్‌పై అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. కొడంగల్‌ నుంచి నిత్యం వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఒకేసారి ఐదారు బస్సులు వస్తే ట్రాఫిక్‌ జామవుతోంది. కొడంగల్‌ బస్టాండ్‌కు 24.10.1979న అప్పటి రవాణాశాఖ మంత్రి వెంగల్‌రావు శంకుస్థాపన చేశారు. ప్లాట్‌ఫారాలు నిర్మించిన తర్వాత తేది 19.12.1981న అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య, రవాణాశాఖ మంత్రి రోశయ్య బస్టాండ్‌ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు బస్టాండ్‌ విస్తరించలేదు. నాటికి నేటికీ ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్‌ నుంచి వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేదు. 2017న అప్పటి రవాణా శాఖా మంత్రి మహేందర్‌రెడ్డి కొడంగల్‌ నుంచి జిల్లా కేంద్రానికి పల్లె వెలుగు బస్సును ప్రారంభించారు. వారం రోజులు తిరగక ముందే బస్సును అధికారులు రద్దు చేశారు. ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆర్టీసీ అధికారులు స్పందించలేదు. వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే రెండు బస్సులు ఎక్కి దిగాల్సి వస్తోంది. పరిగి నుంచి వెళితే 52 కిలోమీటర్లు, తాండూరు నుంచి వెళితే 63 కిలోమీటర్ల దూరం అవుతోంది.

పదకొండు బస్సులతో నిర్వహణ

అందులో ఒకటే ఎక్స్‌ప్రెస్‌

ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి

సౌకర్యాలు లేని కోస్గి బస్సు డిపో
1/1

సౌకర్యాలు లేని కోస్గి బస్సు డిపో

Advertisement
Advertisement