Sakshi News home page

TS Election 2023: ప్రతి ఇంటిలోనా సోనియా బొమ్మ! : గాయకుడు నైనాల రమేష్‌

Published Mon, Sep 18 2023 6:34 AM

- - Sakshi

సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన విజయభేరి బహిరంగ సభ విజయవంతమైంది. సభాస్థలితో పాటు ఓఆర్‌ఆర్‌, సర్వీసు రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు సీడబ్ల్యూసీ సభ్యులతో కూడిన బృందం సభాస్థలికి చేరుకుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే సోనియా గాంధీతో పాటు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేరుకున్నారు.

ఈ సమయంలో వేదికపై ఆసీనులైన పార్టీ ముఖ్యులతో పాటు వివిధ గ్యాలరీల్లో కూర్చొన్న కార్యకర్తలు, నాయకులు సీట్లో నుంచి పైకి లేచి నిటారుగా నిలబడి ‘జై సోనియా’ అంటూ అభివాదం చేశారు. నిజానికి సభకు ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని అంతా ఆశించారు. ఆమె గైర్హాజరవడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని సోనియాగాంధీ ప్రకటించగా, రైతు భరోసా పథకాన్ని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

అభయహస్తం, చేయూత వంటి పథకాలను రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఒక్కోనేత ఒక్కో పథకాన్ని ప్రకటించడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సభా వేదికపై సోనియా 20 నిమిషాలే ఉన్నారు. ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశానికి, తెలంగాణకు ఏం చేసిందో వివరించారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే వర్గాలకు.. ఏంఏం చేయబోతోందో స్పష్టం చేశారు. చివరగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ముఖ్య నేతల ప్రసంగాలు కేడర్‌లో జోష్‌ను నింపాయి.

జన సమీకరణలో పోటీపడిన నేతలు..
జన సమీకరణ విషయంలో నేతలు పోటీపడ్డారు. సభ నిర్వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేశారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి దేప భాస్కర్‌రెడ్డి భారీగా జనాన్ని తరలించారు. చేవెళ్ల నేతలు సైతం ఈ విషయంలో పోటీ పడ్డారు. మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ జిల్లాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. సభ కు హాజరైన వారిలో ఎక్కువగా యువతే కన్పించారు. వీరిలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు.

ముఖ్య నేతల దృష్టిలో పడేందుకు జిల్లా నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీలు యత్నించారు. ఇందు కోసం తుక్కుగూడ–శ్రీశైలం జాతీయ రహదారి నుంచి సభాస్థలికి చేరుకునే మార్గంలో భారీ స్వాగత ద్వారాలు, ఫెక్సీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సభకు భారీగా జనం తరలిరావడం, వెనుక ఉన్న బారీకేడ్లలో కుర్చీలు ఖాళీ లేక మీడియా గ్యాలరీలోకి చొచ్చుకు రావడం కొంత గందరగోళానికి దారితీసింది. వీరిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
‘ప్రతి ఇంటిలోనా సోనియా బొమ్మ ఉండాలి.. అదే ఇంటిపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి’ అంటూ ప్రముఖ గాయకుడు నైనాల రమేష్‌ కళాకారుల బృందం ప్రదర్శించిన కళారూపాలు సభికులను విశేషంగా అలరించాయి. ఆగదు..ఆగదు.. ఈ ఆకలిపోరు ఆగదు.., మూడు రంగుల జెండాపెట్టి..సింగమోలే కదిలినాడు మన రాహుల్‌గాంధీ.. నిగ్గదీసి అడిగే మొనగాడు పాటకు సభికులంతా ఒక్కసారిగా కుర్చీల్లోనుంచి పైకి లేచి డ్యాన్స్‌ చేశారు.

మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంత రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఖర్గే ప్రసంగాన్ని భట్టి తెలుగులోకి అనువదించగా, సోనియా, రాహుల్‌ గాంధీ ప్రసంగాలను ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనువదించారు. సభకు హాజరైన సామాన్య కార్యకర్తలు సైతం కళాకారులతో కలిసి నృత్యం చేయడం వారిలోమరింత జోష్‌ నింపినట్లైంది.

ఆ నాలుగు గంటలు ట్రా‘ఫికర్‌’..
తుక్కుగూడకు వచ్చి వెళ్లే ప్రధాన మార్గాలు సహా ఓఆర్‌ఆర్‌పై కూడా భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల వాహనాలతో పాటు సాధారణ ప్రయాణికుల వాహనాలు కూడా ఈ ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు ఇదే పరిస్థితి.

ఇటు ఆదిబట్ల మొదలు.. అటు శంషాబాద్‌ వరకు.. పహడీషరీఫ్‌ మొదలు.. మహేశ్వరం కమాన్‌ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్‌ చేయకపోవడం, వచ్చిపోయే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించకపోవడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సుమారు నాలుగు గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లోనే గడపాల్సి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement