నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

Published Sun, Sep 24 2023 3:26 AM

వికారాబాద్‌ అర్బన్‌: ఎన్టీఆర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న డీఎస్సీ విద్యార్థులు  - Sakshi

వికారాబాద్‌ అర్బన్‌: ప్రతేక రాష్ట్రం ఏర్పడితే ఇంటికో కొలువు ఇస్తానని చెప్పిన కేసీఆర్‌.. తెలంగాణ వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగించి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఆరోపించారు. శనివారం డీఎస్సీ అభ్యర్థులు మినీ డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ వేయాలని కోరుతూ ఎన్టీఆర్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. వీరికి మాజీమంత్రి సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేసీఆర్‌ మోసపూరితమైన హామీలు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను అన్నీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని, ఏళ్లుగా నిరుద్యోగులు ఇంటికి దూరంగా ఉంటూ చదువుకుంటున్నారని, కంటి తుడుపు చర్యగా ఐదు వేల పోస్టులు భర్తీ చేయడం దారుణమని మండిపడ్డారు. జిల్లాలో కొన్ని కేటగిరీల వారికి ఒక పోస్టు కూడా లేకపోవడం నిరుద్యోగులను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి డీఈడీ, బీఈడీ పూర్తి చేశాక పోస్టులు లేవని తెలియడంతో మనస్తాపం చెందుతున్నారని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మేగా డీఎస్సీని వేయాలన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. నిరసనలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు.

పరీక్షకు నాలుగు నెలల సమయం..

తాండూరు టౌన్‌: మినీ డీఎస్సీని విరమించుకుని మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థుఽలు తాండూరు పట్టణం అంబేడ్కర్‌ చౌక్‌లో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినదించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్‌, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వ సుజాత, కౌన్సిలర్‌ ప్రభాకర్‌ గౌడ్‌, బీసీ సంఘం సభ్యుడు సయ్యద్‌ షుకూర్‌, లక్ష్మణాచారీ, విద్యార్థి నాయకులు శివకుమార్‌, దీపక్‌ రెడ్డిలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. మాట తప్పిందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేసీఆర్‌ నిరుద్యోగులను దగా చేస్తున్నారని విమర్శించారు. బదిలీలు, ఉద్యోగ విరమణలతో పాటు భర్తీ చేయాల్సిన పోస్టులు అన్నీ కలిపి 23వేలకు పైగానే ఉన్నాయని, వాటిని మెగా డీఎస్సీ రూపంలో భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ సిలబస్‌ చాలా ఎక్కువగా ఉందని, సమయం తక్కువగా ఉందని, కావున పరీక్షకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని కోరారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌, బీసీ నాయకులు మతిన్‌, సురేందర్‌ ఉన్నారు.

ఇంటికో కొలువంటూమోసం చేసిన కేసీఆర్‌

మాజీ మంత్రి, అభ్యర్థుల మండిపాటు

మెగా డీఎస్సీ వేయాలంటూ డిమాండ్‌

తాండూరు టౌన్‌: అంబేడ్కర్‌ చౌక్‌లో ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు, నాయకులు
1/1

తాండూరు టౌన్‌: అంబేడ్కర్‌ చౌక్‌లో ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు, నాయకులు

Advertisement
Advertisement