సోషల్‌.. హవా | Sakshi
Sakshi News home page

సోషల్‌.. హవా

Published Mon, Oct 30 2023 4:54 AM

- - Sakshi

షాబాద్‌: ఒకప్పుడు ఎన్నికలు వస్తే గోడలపై రాతలు.. కరపత్రాలు.. వాల్‌పోస్టర్లు.. సభలు.. సమావేశాలతో ప్రచారం నిర్వహించేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. సమాచార సాంకేతిక విప్లవం అన్ని రంగాలతో పాటే రాజకీయాల్లోనూ మార్పు తెచ్చింది. ఎన్నికల ప్రచారానికి సోషల్‌ మీడియాను నేతలు తెగ వాడేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగాం, వాట్సాప్‌, యూట్యూబ్‌తో పాటు పలు రకాల సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయా పార్టీల మేనిఫెస్టోలతో పాటు, పలు రకాల వీడియోలు, ఫొటోలు, మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. యువత ఓట్లు ఎక్కువగా ఉండటంతో మేనిఫెస్టోతో పాటు రోజువారీ కార్యక్రమాలను పోస్టు చేసి వారికి చేరువయ్యేలా చూస్తున్నారు. ఇందుకు ఆయా పార్టీలు సోషల్‌ మీడియా కన్వీనర్లను సైతం నియమించుకోవడం విశేషం.

డిజిటల్‌ సంస్థలతో ఒప్పందం..

సోషల్‌ మీడియాలో ఆయా పార్టీలు ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇందుకు పార్టీలు రూ.లక్షల్లో చెల్లిస్తున్నాయి. ఇక డిజిటల్‌ సంస్థలు సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగాం, టెలిగ్రాం, యూట్యూబ్‌లో పార్టీల పేరిట వందల సంఖ్యలో అకౌంట్లు క్రియేట్‌ చేస్తున్నాయి. వీటి ద్వారా యాడ్స్‌తో పాటు ఆయా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలో లైక్‌లు, కామెంట్లు పెట్టేందుకు వందల సంఖ్యలో ఫేక్‌ అకౌంట్లు తయారు చేస్తున్నారు. వీటి ద్వారా పార్టీల మేనిఫెస్టోలు, వీడియోలు, ఫొటోలను ఎక్కువ మొత్తంలో ప్రజలకు చేరువయ్యేందుకు డిజిటల్‌ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. అభ్యర్థులు, ఆశావహులు కూడా డిజిటల్‌ మీడియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. పార్టీల పథకాలతో పాటు రోజువారీ ప్రచారాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేసి జనాలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్‌ చానళ్లు, గ్రూపులను క్రియేట్‌ చేసి అందులో పోస్టులు పెడుతున్నారు. ఒక్క పోస్టు పెడితే లక్షల మంది చూస్తుండటంతో సోషల్‌ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.

ప్రత్యేక కంటెంట్‌తో..

ఇక డిజిటల్‌ మీడియా సంస్థలు తాము ఒప్పందం కుదుర్చుకున్న పార్టీల కోసం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల కోసం పార్టీలకు అనుకూలమైన, ప్రజలకు చేరువయ్యే అంశాలతో కూడిన ప్రత్యేక కంటెంట్‌ తయారు చేస్తున్నాయి. ఈ కంటెంట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువచేస్తున్నాయి. పోస్టులను ఎక్కువ మందికి చేరువచేయడానికి ఆయా సోషల్‌ మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించి, లొకేషన్‌తో పాటు ఆయా వయస్సుల ఓటర్లకు చేరువయ్యేలా చూస్తున్నారు. ప్రత్యేక కంటెంట్‌ కోసం డిజిటల్‌ సంస్థలకు పార్టీలు భారీగా డబ్బులు ఇస్తున్నాయి. కంటెంట్‌ రాసిచ్చే వారిని డిజిటల్‌ మీడియా సంస్థలే భారీగా రిక్రూట్‌ చేసుకుంటున్నాయి.

నిర్దారించుకోవాలి

ఇక ఆయా పార్టీలు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్న కంటెంట్‌ను చూసి ఏది నిజమో..ఏది అబద్దమో తెలియని పరిస్థితిలో ఓటర్లున్నారు. ఓటర్లు కూడా సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు, పోస్టులను నిర్దారించుకోవడం అతిముఖ్యం. అలా నిర్దారించుకున్న తర్వాతే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులపై ఇబ్బంది కలిగితే ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు.

సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుంటున్న పార్టీలు

ఎన్నికల వేళ విరివిగా సోషల్‌ మీడియా వినియోగం

మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లేలా పోస్టులు

డిజిటల్‌ సంస్థలతో ఒప్పందాలు

విమర్శలు, ప్రతివిమర్శలకు ప్రత్యేక కంటెంట్‌

రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్న పార్టీలు

Advertisement
Advertisement