ఫ్యాబ్‌సిటీ ఏర్పాటుతో పెరిగిన ఓటర్లు | Sakshi
Sakshi News home page

ఫ్యాబ్‌సిటీ ఏర్పాటుతో పెరిగిన ఓటర్లు

Published Mon, Nov 6 2023 4:34 AM

- - Sakshi

గ్రామీణం, పట్టణం, నగరం మూడు ప్రాంతాలు కలిసి ఉండే ప్రాంతం మహేశ్వరం నియోజకవర్గం. 2009లో ఏర్పడిన ఈ సెగ్మెంట్‌లో మహేశ్వరం, కందుకూరు మండలం, తుక్కుగూడ మున్సిపాలిటీతో పాటుగా జీహెచ్‌ఎంసీలోని సరూర్‌నగర్‌ ప్రాంతం ఇందులోనే ఉంటుంది. ఇప్పటికి మూడు మార్లు ఎన్నికలు జరగ్గా రెండు సార్లు కాంగ్రెస్‌కు, ఒకసారికి ‘కారు’కు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు.

మహేశ్వరం: దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిని అందించిన ఈ నియోజకవర్గం చరిత్రకెక్కింది. విభిన్న జాతులు, వర్గాలు, ప్రాంతాల మిళితం ఈ సెగ్మెంట్‌. ఇక్కడ హస్తం గుర్తుపై గెలుపొందిన సబితారెడ్డి రాజజేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు. 2018 విజయం తర్వాత కాంగ్రెస్‌ను వీడి కారెక్కింది. దీంతో ఆమెకు సీఎం కేసీఆర్‌ తన మంత్రి వర్గంలో బెర్తు కల్పించారు. దీంతో ఆమె తెలంగాణలోనూ తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించారు. నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, మైనార్టీల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి.

ఫ్యాబ్‌సిటీ ఏర్పాటుతో పెరిగిన ఓటర్లు

నియోజకవర్గంలో ఫ్యాబ్‌ సీటీ(ఈ–సీటీ), హార్డ్‌వేర్‌ పార్కు, కందుకూరులో ఫార్మాసీటీ, మహేశ్వరంలో ఎలక్ట్రానిక్‌ పార్కులో భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమలు ఉండడంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ప్యాబ్‌సీటీ(ఈ–సీటీ)లో పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. స్థానికేతరులు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఓట్లు భారీగా నమోదయ్యాయి. నియోజకవర్గాన్ని మినీ భారత్‌గా పిలుస్తారు.

జనరల్‌ స్థానంగా

2009 సంవత్సరంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు జనరల్‌ స్థానంగా ఉంది. మహేశ్వరం, కందుకూరు మండలాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో ఉండేవి. బాలాపూర్‌, సరూర్‌నగర్‌ రెండు అర్బన్‌ మండలాలు మలక్‌పేట్‌ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. డీలిమిటేషన్‌తో మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్‌, సరూర్‌నగర్‌ మండలాలను కలుపుతూ మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది.

పట్టు సాధిస్తున్న పటోళ్ల

మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ నుంచి సబితారెడ్డి రెండుసార్లు, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి(టీకేఆర్‌) టీడీపీ నుంచి ఒక సారి గెలుపొందారు. చెవేళ్ల నుంచి వచ్చి మహేశ్వరంలో పోటీ చేసి రెండు పర్యాయాలు గెలుపొందిన సబితారెడ్డి నియోజకవర్గవాసుల ఆత్మభిమానం చూరగొన్నారు. నియోజకవర్గంలో ఆమెకు వ్యక్తిగతంగా బలమైన కేడర్‌ను తయారు చేసుకుంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్నారు.

దేశంలోనే తొలి మహిళా హోంమంత్రిని ఇచ్చిన సెగ్మెంట్‌గా రికార్డు

రాష్ట్రంలో మొదటి మహిళా మంత్రి ఇక్కడి నుంచే..

‘కారు’కు ‘కమలం’కు దక్కని అవకాశం

పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ప్రత్యర్థులుగా మారిన సబిత, కేఎల్‌ఆర్‌

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి సబితాఇంద్రారెడ్డి, కాంగ్రెస్‌ నుండి కిచ్చనగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్‌), బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్‌లు పోటీ చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలకు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. నియోజకవర్గంలో ఈ సారి బీర్‌ఎస్‌ను బోణీ కొట్టిస్తాననే ధీమాతో మంత్రి సబితారెడ్డి ముందుకు వెళ్తున్నారు. మరోసారి మా కంచుకోటపై కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడిస్తామని కేఎల్‌ఆర్‌ గట్టి నమ్మకంతో పనిచేస్తున్నారు. సానుభూతితోపాటుగా బలమైన కేడర్‌ ఉండడం కమలానికి కలిసి వస్తుందని అందెల శ్రీరాములు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికలో నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

నియోజకవర్గ ఏర్పాటు నుంచి ఎన్నికల వివరాలు

సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ మెజారిటీ

2009 సబితారెడ్డి కాంగ్రెస్‌ తీగల కృష్ణారెడ్డి టీడీపీ 7,833

2014 టీకేఆర్‌ టీడీపీ మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ 30,786

2018 సబితారెడ్డి కాంగ్రెస్‌ టీకేఆర్‌ టీఆర్‌ఎస్‌ 9,227

మండలాల వారీగా ఓటర్ల వివరాలు

మండలం పోలింగ్‌ స్టేషన్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

మహేశ్వరం 72 33156 31790 7 64,953

కందుకూరు 61 25550 24689 1 50,240

బాలాపూర్‌ 245 153074 14474 56 2,97,884

సరూర్‌నగర్‌ 133 64492 59095 3 1,23,590

మొత్తం 511 2,76,272 2,60,328 67 5,36,667

Advertisement
Advertisement