‘సి–విజిల్‌’ను సద్వినియోగం చేసుకోండి | Sakshi
Sakshi News home page

‘సి–విజిల్‌’ను సద్వినియోగం చేసుకోండి

Published Sat, Nov 11 2023 4:20 AM

-

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి ప్రజలు సి–విజిల్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా, బలవంతంగా ప్రభావితం చేసినా సి–విజిల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా సరే సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఎలక్షన్‌ కమిషన్‌ ప్రజల చేతిలో సి–విజిల్‌ అనే బ్రహ్మాస్త్రం పెట్టిందని, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉన్న వారెవరైనా యాప్‌ను ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. సమస్యను ఎప్పటి కప్పుడు కెమెరా ఆన్‌ చేసుకొని ఫొటో లేదా వీడియో తీసి సమస్యను సంక్షిప్తంగా టైప్‌ చేసి పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సి–విజిల్‌ ద్వారా చేసే ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. తమ కళ్లముందు కనిపిస్తున్న అన్యాయాన్ని వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ యాప్‌ సురక్షితమైనదని, దీనిని ఆపరేటింగ్‌ చేయడం సైతం చాలా సులువైందన్నారు. ఇంగ్లిష్‌, తెలుగులో సమస్యను పంపించవచ్చని కలెక్టర్‌ సూచించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు

ఎన్నికల ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ సహా టోల్‌ ఫ్రీ నంబర్‌ 040–23238545 ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్‌ రూం 24 గంటలు పని చేస్తుంది. సిబ్బంది అందుబాటులో ఉంటారు. రిజిస్టర్‌ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను రికార్డ్‌ చేయనున్నారు. జిల్లా ప్రజలు ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్‌ కోరారు.

రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి

Advertisement

తప్పక చదవండి

Advertisement