పోటెత్తిన యువత | Sakshi
Sakshi News home page

పోటెత్తిన యువత

Published Tue, Nov 21 2023 4:32 AM

- - Sakshi

పది రోజుల క్రితం ప్రకటించిన ఓటరు లిస్టులో పెరిగిన ఓటర్లపై చర్చ ఊపందుకుంది. నూతనంగా ఓటు హక్కు వచ్చిన వారి పోలింగ్‌పైనే గెలుపోటముల ప్రభావం ఉంటుందని ప్రచారం సాగుతోంది. మరో తొమ్మిది రోజులు మాత్రమే పోలింగ్‌కు సమయం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు.

పరిగి: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో వారం మాత్రమే ప్రచారం చేసేందుకు అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులకు ప్రతీ రోజు కీలకంగా మారనుంది. ఇన్నాళ్లు ప్రచారం, ర్యాలీలు, ప్రసంగాలు, చేరికలపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీలు ఇప్పుడు గెలుపు వ్యుహాలకు పదునుపెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను తిప్పకొడుతూ గెలుపు దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అభ్యర్థుల్లో ఎన్నికల ఫీవర్‌ మొదలైంది. ఇప్పటికే విమర్శులు, ప్రతి విమర్శలతో స్వరం పెంచిన అభ్యర్థులు మాటల తూటాలతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై ఎంత ప్రచారం, ఎంత డబ్బు ఖర్చు చేశామన్న దానికన్న ఎంత మందిని తమవైపు తిప్పుకున్నమనేది ప్రధానం కానుంది. ఈ ఎన్నికలో పరిగి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎప్పుడు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ మద్యలో ప్రధాన పోటీ ఉండేది కాని ఈ సారి బీజేపీ సైతం ఫైట్‌లో కనిపిస్తోంది. పరిగి అసెంబ్లీ స్థానానికి 28 మంది నామినేషన్లు దాఖలు చేయగా 11 నామినేషన్లను తిరస్కరించారు. దీంతో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్‌పీ పార్టీలతో పాటు పలు పార్టీలు, స్వతంత్రులతో కలపి మొత్తం 15 మంది బరిలో ఉన్నారు.

భారీగా పెరిగిన ఓటర్లు

నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉండగా మొత్తం 2,52,379 మంది ఓట్లు ఉన్నారు. ఎన్నికల సంఘం అక్టోబర్‌ వరకు కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించి ఈనెల 10న కొత్త లిస్టును విడుదల చేసింది. కొత్త ఓటరు లిస్టు ప్రకారం 2,59,422 మంది ఓటర్లు ఉండగా మొత్తం 7043 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. 2018 ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపుగా 30వేల మంది ఓటర్లు పెరిగారు. వీరు ఎవరి వైపు ఉంటారనే అంచనాలు వేస్తున్నారు. ఈ ఓట్లు ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే నియోజకవర్గంలో చర్చ సాగుతోంది.

కండువాలు మార్చుతున్న నాయకులు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలో పలువురు నాయకుల చేరికల పర్వం కొనసాగుతుంది. అయితే ఎక్కువ శాతం బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరగా, కాంగ్రెస్‌, బీజేపీల నుంచి పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. యువత మాత్రం ఎక్కువగా కషాయ కండువా కప్పుకున్నారు. ఇటీవల దోమ, కుల్కచర్ల ఎంపీపీలు అనసూయ, సత్యహరిశ్చందర్‌ల, పరిగి వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ కారు దిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. దోమ మండలంలో ఐదుగురు సర్పంచ్‌లు, కుల్కచర్ల మండలంలో నలుగురు సర్పంచ్‌లు మొత్తం నియోజకవర్గంలో పదుల సంఖ్యలో హస్తం చేయి అందించడంతో పార్టీ బలం పెరిగిందనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, నిరుద్యోగ ఓటర్లు తమవైపే ఉన్నారని, ఆరు గ్యారంటీలు, ఇతర పార్టీలు నాయకుల చేరిక తమ గెలుపునకు దోహదం చేస్తుందనే భావనలో కాంగ్రెస్‌ శ్రేణులున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాలో గులాబీ శ్రేణులు లెక్కలేసుకుంటున్నాయి. కేంద్రంలో ఉన్నతది తమ ప్రభుత్వమేనని తెలంగాణలోనూ సత్తా చాటుతామని కమళదళం కదం తొక్కుతోంది. ఏది ఏమైనా డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపుతోనే పూర్తి స్పష్టత రానుంది.

పెరిగిన ఓటర్లు ఎవరికి జై

అంచనాలు వేస్తున్న విష్లేషకులు

మొదలైన కౌంట్‌డౌన్‌

అభ్యర్థుల్లో టెన్షన్‌

1/1

Advertisement
Advertisement