ప్రక్షాళన దిశగా..! | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన దిశగా..!

Published Wed, Dec 13 2023 5:12 AM

- - Sakshi

తాండూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాఖాలో అభివృద్ధికి బాటలు వేసే సమర్థవంతమైన జిల్లా స్థాయి, డివిజన్‌ స్థాయి అధికారుల టీమ్‌ను రెడీ చేసే ప్రక్రియ మొదలైంది. చాలా కాలంగా జిల్లాలో తిష్ట వేసిన మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులను బదిలీపై పంపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు తమకు నచ్చిన అధికారులను నియమించుకొని పాలన సాగించారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. అలాంటి అధికారులకు చెక్‌ పెడుతూ లూప్‌లైన్‌లోకి పంపించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో పలువురు అధికారులు దశాబ్ద కాలంగా ఒకే చోటు విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి వారిని సైతం బదిలీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పూర్తిగా ప్రక్షాళన

జిల్లాలోని 20 మండలాలతో పాటు డివిజన్‌, జిల్లా స్థాయి అధికారుల ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. జిల్లాలో 5నుంచి పదేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న అధికారుల జాబితానే ఇప్పటికే రెడీ చేసినట్లు తెలిసింది. జిల్లా స్థాయి అధికారుల నియామకాలపై సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నట్లు సమాచారం. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్ద పీట వేసి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు వ్యవసాయం, మున్సిపల్‌, అటవీ, మెప్మా, ఐసీడీఎస్‌, విద్య, వైద్యం, మైన్స్‌, ఎకై ్సజ్‌, డీఆర్డీఓ, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖలతో పాటు పలు శాఖల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న అధికారుల బదిలీలు అనివార్యమయ్యాయి. వారం రోజుల వ్యవధిలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండటంతో గత ప్రభుత్వంలో ఉన్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో దశాబ్ద కాలంగా తిష్టవేసిన అధికారుల బదిలీలకి ప్రభుత్వం కసరత్తు

సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ప్రత్యేక ఫోకస్‌

Advertisement
Advertisement