సీఎం రేవంత్‌ నజర్‌.. కొడంగల్‌కు మంచి రోజులు | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ నజర్‌.. కొడంగల్‌కు మంచి రోజులు

Published Tue, Jan 23 2024 6:36 AM

కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రి - Sakshi

కొడంగల్‌: కొడంగల్‌కు మంచి రోజులు వచ్చాయి. నియోజకవర్గంలోని 8 మండలాల అభివృద్ధిపై రేవంత్‌ సర్కార్‌ దృష్టి సారించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత కొడంగల్‌కు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు గురైంది. తెలంగాణ ఏర్పడక ముందు సీమాంధ్ర పాలకులు, తెలంగాణ వచ్చినా సొంత పాలకులు పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, రవాణా, ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారు. గత పాలకుల వివక్ష వల్ల కొడంగల్‌ను రెండు ముక్కలు చేసి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మార్పు కోరుకున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి. కొడంగల్‌ అభివృద్ధి కోసం కడా (కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ)ను ఏర్పాటు చేశారు. ఈ అథారిటీ పరిధిలో నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కడా చైర్మన్‌గా కలెక్టర్‌ నారాయణరెడ్డి, ప్రత్యేకాధికారిగా వెంకట్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనులకు శాఖల వారీగా సిద్ధం చేసిన ప్రతిపాదనలను మంగళవారం కడా ఆధ్వర్యంలో కలెక్టర్‌కు సమర్పించే అవకాశం ఉంది. కొడంగల్‌, కోస్గి ఆస్పత్రులను 100 పడకలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. గురుకులాలు, పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు.

జీఓ 69తో కొడంగల్‌, నారాయణపేట, మక్తల నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా, మద్దూరును మున్సిపల్‌గా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. వికారాబాద్‌ – కృష్ణా రైల్వే లైన్‌కు లైన్‌ క్లియర్‌ కానుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌ ఆ శాఖ అధికారులతో చర్చించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ప్రభు త్వం అధికారులను ఆదేశించింది. నియోజకవర్గానికి వ్యవసాయ డిప్లమో కళాశాల, 50 ఎకరాల్లో ఉద్యానవన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కొడంగల్‌ బస్టాండ్‌ విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

కోస్గి ఆర్టీసీ బస్సు డిపోకు జవసత్వాలు పోయనున్నారు. ప్రస్తుతం 10 ఆర్డినరీ, ఒక ఎక్స్‌ప్రెస్‌ బస్సుతో డిపోను నడిపిస్తున్నారు. త్వరలో కోస్గి డిపో స్థాయిని పెంచే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, కోస్గిలో ఇంజనీరింగ్‌ కళాశాల, కొడంగల్‌లో పీజీ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సర్కార్‌ ఉంది. నియోజకవర్గంలో మూసి వేసిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి కృషి జరుగుతోంది. ప్రతి గ్రామం, తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని రేవంత్‌ కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.

కొడంగల్‌ నియోజకవర్గం కొత్త మ్యాప్‌
1/1

కొడంగల్‌ నియోజకవర్గం కొత్త మ్యాప్‌

Advertisement
Advertisement